తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకేజీ ఉదంతంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ పేపర్ లీకేజీ వెనక ఇద్దరు వ్యక్తులు ఉన్నారని, వాళ్లిద్దరూ చేసిన తప్పు అని అన్నారు. ఇది వ్యవస్థ చేసిన తప్పు కాదని మంత్రి కేటీఆర్ చెప్పారు. టీఎస్ పీఎస్సీ చైర్మన్, నలుగురు మంత్రులతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. లీకేజీ కేసులో ఇంకెవరు ఉన్నా అందరినీ కఠినంగా శిక్షిస్తామన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంతో సమర్థవంతంగా పని చేస్తుందని, వ్యవస్థ చక్కగా ఉందని వివరించారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 155 నోటిఫికేషన్లు విడుదల అయ్యాయని 37 వేల ఉద్యోగాలను టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చేశామన్నారు. భారతదేశంలోనే అత్యుత్తమ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లలో ఒకటిగా టీఎస్ పీఎస్సీ గుర్తింపు పొందిందని, కాలాగుణంగా సాంకేతికంగా ముందుకు వెళుతుందన్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు.. రెండు సార్లు తెలంగాణకు వచ్చి టీఎస్ పీఎస్సీపై అధ్యయనం చేశారని అన్నారు.
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన నేపథ్యంలో మనస్థాపానికి గురై సిరిసిల్లకు చెందిన యువకుడు నవీన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. నవీన్ తండ్రి నాగభూషణంతో ఆయన ఫోన్ లో మాట్లాడారు. మీ కుటుంబానికి అండగా ఉంటామని, అధైర్యపడొద్దని నవీన్ కుమార్ తల్లిదండ్రులకు కేటీఆర్ భరోసానిచ్చారు. అర్ధాంతరంగా తనువు చాలించడం బాధాకరమని, నవీన్ అంత్యక్రియలకు దగ్గరుండి ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.