తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( టీఎస్‌పీఎస్సీ ) పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారానే రేపుతోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో టీఎస్‌పీఎస్సీ అంశంపై సమీక్ష నిర్వహించారు. టీఎస్‌పీఎస్సీ ఛెర్మన్ జనార్థన్ రెడ్డి శనివారం ఉదయం ప్రగతి భవన్‌కు వచ్చారు. సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. ఈ కీలక భేటీలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పేపర్ లీకేజీ వ్యవహరం తో పాటు పరీక్షల నిర్వహణ, తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
పలు ప్రశ్నాపత్రాలు లీకైన నేపథ్యంలో ఇప్పటికే నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ సహా ఏఈ, డీఏవో తదితర పరీక్షలను రద్దు చేశారు. ఈ పరీక్షలు మళ్లీ నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఈ నేపథ్యంలోనే కార్యాచరణపై దృష్టి సారించింది.
పలు ప్రశ్నాపత్రాలు లీకైన వ్యవహారంపై ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పరీక్షలు రద్దు చేసినంత మాత్రాన సరిపోదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.