TSPSC Paper leak: గన్‌పార్క్‌ వద్ద ఉద్రిక్తత.. బండి సంజయ్‌ అరెస్ట్‌

టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

By అంజి  Published on  17 March 2023 4:15 PM IST
TSPSC Paper leak: గన్‌పార్క్‌ వద్ద ఉద్రిక్తత.. బండి సంజయ్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ( టీఎస్‌పీఎస్సీ ) పేపర్‌ లీకేజీ వ్యవహారంపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పోలీసుల ఆంక్షలను ధిక్కరిస్తూ టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు కరీంనగర్ ఎంపీ, పెద్ద సంఖ్యలో బిజెపి కార్యకర్తలతో కలిసి పాదయాత్రగా బిజెపి రాష్ట్ర కార్యాలయం నుండి బయలుదేరి గన్ పార్క్‌కు చేరుకుని టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలంగౌడ్‌, నందీశ్వర్‌గౌడ్‌, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.మనోహర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తితో కలిసి బండి సంజయ్‌ అమరవీరులకు నివాళులర్పించారు. కార్యకర్తల నినాదాల మధ్య నిరసన ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీని సాకుగా చూపి రిక్రూట్‌మెంట్లను నిలిపివేస్తూ అమరవీరుల ఆకాంక్షలను ప్రభుత్వం దెబ్బతీస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు.

అయితే బీజేపీ నిరసనను అడ్డుకునేందుకు పోలీసు బలగాలు గన్ పార్క్ వద్ద పెద్ద సంఖ్యలో మోహరించారు. ట్రాఫిక్ సమస్య కారణంగా బండి సంజయ్‌ను వేదిక నుండి వెళ్లిపోవాలని అభ్యర్థించారు. పోలీసులు చెప్పినా పట్టించుకోని బీజేపీ అధ్యక్షుడు టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. మరోవైపు బండి సంజయ్‌ అరెస్ట్‌పై బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మరోవైపు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీకి నిరసనగా హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన ఏబీవీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నేత సురేశ్‌ కమల్‌ మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజీనామా చేయాలని, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శులు, చైర్మన్‌ల తొలగింపునకు డిమాండ్‌ చేశారు.

మరోవైపు పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తూ.. టీఎస్పీఎస్సీ, తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీపై బీఆర్‌ఎస్‌ నేతలు, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సిబ్బందిపై అనుమానాలు వ్యక్తం చేసిన వైఎస్‌ షర్మిల.. సిస్టమ్‌ పాస్‌వర్డ్‌లు ఎలా లీక్‌ అయ్యాయని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కుట్ర జరుగుతోందని, నిరుద్యోగ యువత కమిషన్‌పై విశ్వాసం కోల్పోయారని ఆమె అన్నారు. ఇందుకు ప్రభుత్వం సిగ్గుపడాలని వైఎస్ షర్మిల అన్నారు. కేసీఆర్ తన కూతురు కవిత కేసులపై దృష్టి పెట్టారని, దీంతో నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు.

Next Story