టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ స్కాం: మరో 19 మంది అరెస్ట్

టీఎస్‌పీఎస్‌సీ క్వశ్చన్‌ పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సోమవారం నాడు ఈ కేసులో మరో 19 మందిని సిట్‌ అరెస్ట్‌ చేసింది.

By అంజి  Published on  11 July 2023 7:12 AM IST
TSPSC, paper leak scam, Telangana, Hyderabad

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ స్కాం: మరో 19 మంది అరెస్ట్

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్‌సీ క్వశ్చన్‌ పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సోమవారం నాడు ఈ కేసులో మరో 19 మందిని సిట్‌ అరెస్ట్‌ చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 85కు చేరుకుంది. ఇది వరకు అరెస్ట్‌ అయిన వారి నుండి విచారణలో సేకరించిన సమాచారం, ఆధారాలతో పోలీసులు నిన్న మరో 19 మందిని అరెస్ట్ చేశారు. ఈ పేపర్‌ లీక్‌ కేసులో మరి కొందరు అరెస్ట్‌ ఛాన్స్‌ ఉందని సమాచారం. కాగా వీరిని అరెస్ట్ చేసేందుకు 5 ప్రత్యేక బృందాలను స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ ఏర్పాటు చేసింది. వరంగల్‌లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో డీఈ పని చేసిన రమేష్‌ 30 మందికి ఏఈఈ ప్రశ్నా పత్రం అమ్మినట్టు సిట్‌ గుర్తించింది.

హైటెక్ పద్ధతిలో మాస్ కాపీయింగ్ చేయించి అరెస్ట్ అయిన పోల రమేష్‌కు నిందితులకు సంబంధాలు ఉన్నాయని సిట్‌ గుర్తించింది. అసిస్టెంట్ ఇంజనీర్ పేపర్‌ను పోల రమేష్‌ 30 మందికి విక్రయించాడు. అతని వద్ద సేకరించిన సమాచారంతో పేపర్ కొనుగోలు చేసిన నిందితులను అరెస్టు చేస్తున్నారు సిట్ అధికారులు. పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ తన వద్దకు ఏఈ పేపర్ రాగానే దాన్ని విక్రయించాలని తన స్నేహితుడు సురేష్​కు చేప్పాడు. సురేష్​కు బంధువైన పోల రమేష్​కు ఈ విషయం చెప్పగా.. తాను విక్రయస్తానని చెప్పి ప్రశ్నాపత్రాలను తీసుకున్నాడు. ఇదే క్రమంలో అభ్యర్ధిని బట్టి పోల రమేష్ డబ్బు వసూలు చేశాడు. ఈ నెలాఖరు లోపు 30 మందిని పోలీసులు అరెస్ట్ చేయున్నట్లు సమాచారం.

ఈ ఏడాది మార్చి నెలలో టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అంశం వెలుగు చూసింది. మొదట టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయంలో కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని అధికారులు భావించారు. అయితే టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అయిందని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఆ తర్వాత పేపర్ లీక్ కేసు దర్యాప్తును సిట్‌కు అప్పగించారు. మొదట బేగంపేట పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేయగా.. ఇప్పుడు ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలోని సిట్ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఈ పేపర్ లీక్ కారణంగా గతంలో నిర్వహించిన పరీక్షలను రద్దు చేయగా, నిర్వహించాల్సిన మరికొన్ని పరీక్షలను వాయిదా వేశారు. వాయిదా పడిన, రద్దు చేసిన పరీక్షలను టీఎస్‌పీఎస్‌సీ తిరిగి నిర్వహిస్తుంది.

ఇటీవలే గ్రూప్-1, గ్రూప్-4 పరీక్షలను టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించింది. ఈ ఏడాది జూన్ 9వ తేదీన ఈ కేసుకు సంబంధించి సిట్ కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసింది. రూ. 1.63 కోట్లు.. ఈ స్కాంలో చేతులు మారినట్టుగా చార్జీషీట్ లో సిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఈడీ అధికారులు కూడ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story