అత్యవసరమైతేనే బయటకు రండి.. తెలంగాణ పోలీస్ శాఖ
TS police alert on heavy rains.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని
By తోట వంశీ కుమార్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ పోలీసు శాఖ అప్రమత్తమైంది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించింది. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలంటూ పేర్కొంది. వరద ఉద్దృతి ఉన్నప్రాంతాల్లో నీటి గుండా దాటే ప్రయత్నం చేయొద్దని కోరింది. ఏదైన సమస్య వస్తే.. వెంటనే డయల్ 100కి ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేసింది.
#TelanganaRains#Dial100 pic.twitter.com/T3NigETAzu
— Telangana State Police (@TelanganaCOPs) September 27, 2021
హైదరాబాద్ నగరంలో రానున్న నాలుగైదు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అలెర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 040 23202813 కాల్ చేయాలని చెప్పారు.
గులాబ్ తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు మహబూబాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, ఆదిలాబాద్, కుమురంభీం అసిఫాబాద్, మంచిర్యాలలో వర్షాలు కురుస్తున్నాయి.