తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో అతిపెద్ద గిరిజన జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. జాతర సందర్భంగా వనదేవతలను తెలంగాణ మంత్రి మల్లారెడ్డి దర్శించుకున్నారు. అనంతరం మొక్కులు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని అమ్మవార్లను మొక్కుకున్నానని చెప్పారు. గతంలో తాను కోరుకున్న కోర్కెలను అమ్మవార్లు నేరవేర్చారని మల్లారెడ్డి తెలిపారు.
అలాగే ఇవాళ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు సమర్పించారు. ఇవాళ మేడారం మహాజాతరలో పాల్గొని సమ్మక్క–సారమ్మలను సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. అనంతరం మొక్కులు చెల్లించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపధ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా మేడారం మొత్తం సమ్మక్క, సారలమ్మల నామస్మరణతో మార్మోగుతోంది. శనివారం వరకు జాతర కొనసాగనుంది. రేపు సమ్మక్క సారలమ్మ దేవతల వనప్రవేశంతో జాతర ముగియనుంది.