'భాషను ఎంచుకునే హక్కు ప్రజలకే ఉండాలి.. బలవంతంగా రుద్దొద్దు'

TS Minister KTR said that people should have the right to choose their language. ఐఐటీలు, సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగాల్లో హిందీని తప్పనిసరి చేస్తూ కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని

By అంజి  Published on  12 Oct 2022 12:02 PM IST
భాషను ఎంచుకునే హక్కు ప్రజలకే ఉండాలి.. బలవంతంగా రుద్దొద్దు

ఐఐటీలు, సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగాల్లో హిందీని తప్పనిసరి చేస్తూ కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ వ్యతిరేకించారు. హిందీని తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాషను ఎంచుకునే హక్కు ప్రజలకే ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నానని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ''భారతదేశానికి జాతీయ భాష అంటూ ఏదీ లేదు. అనేక అధికారిక భాషల్లాగే హిందీ కూడా ఒకటి అధికార భాష. ఐఐటీలు అండ్ కేంద్ర ప్రభుత్వ రిక్రూట్‌మెంట్లలో హిందీని తప్పనిసరి చేయడం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని తుంగలో తొక్కుతోంది. భారతీయులకు భాష ఎంపిక హక్కు ఉండాలి. హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిద్దాం'' అని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

అన్ని సెంట్రల్ టెక్నికల్, నాన్-టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్‌తో పాటు సెంట్రల్ వర్సిటీలలో బోధనా మాధ్యమంగా ఇంగ్లీష్ కు బదులు హిందీని ప్ర‌వేశ‌పెట్టాల‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన పార్లమెంటరీ ప్యానెల్ చేసిన సిఫార్సు చేసింది. హిందీని తప్పనిసరి భాషగా పేర్కొంటూ మరో 'భాషాయుద్ధం' ప్రారంభించకూడదని అక్టోబర్ 11న కేంద్ర ప్రభుత్వాన్ని త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా కోరారు. ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని కేంద్ర ప్ర‌భుత్వానికి స్టాలిన్ విజ్ఞ‌ప్తి చేశారు. హిందీ భాషకు సంబంధించి కమిటీ సిఫార్సులను కేరళలో కూడా వ్యతిరేకించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి, దేశ భాషా వైవిధ్యానికి విరుద్ధంగా ఉందని ప్రభుత్వం విమర్శించింది.

Next Story