డిగ్రీ, పీజీ పరీక్షల‌ను వాయిదా వేయాల‌ని హైకోర్టులో పిటిష‌న్‌.. జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు

TS High court rejected lunch motion petition on degree examinations.తెలంగాణ‌లోని అన్ని యూనివ‌ర్సిటీల ప‌రిధిలోని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 July 2021 7:46 AM GMT
డిగ్రీ, పీజీ పరీక్షల‌ను వాయిదా వేయాల‌ని హైకోర్టులో పిటిష‌న్‌.. జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు

తెలంగాణ‌లోని అన్ని యూనివ‌ర్సిటీల ప‌రిధిలోని డిగ్రీ, పీజీ ప‌రీక్షల‌ను ఈనెల‌లోనే నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం సూచించిన సంగ‌తి తెలిసిందే. దీంతో అన్ని యూనివ‌ర్సిటీలు ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు తేదీల‌ను ప్ర‌క‌టించి ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని నిర్వ‌హిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో డిగ్రీ, పీజీ ప‌రీక్ష‌ల వాయిదాపై హైకోర్టులో లంచ్ మోష‌న్ పిటిష‌న్ వేయ‌డానికి ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్ర‌య‌త్నించారు.

పిటిష‌న్ స్వీక‌ర‌ణ‌కు అనుమ‌తి కోర‌గా.. స్పందించిన హైకోర్టు ప‌రీక్ష‌ల అంశాన్ని అత్య‌వ‌స‌ర విచార‌ణ‌కు నిరాక‌రించింది. ఈ రోజు ఉదయం పది గంటలకు ప‌రీక్ష‌లు మొదలైతే.. వాయిదా వేయాల‌ని ఇప్పుడు హైకోర్టుకు రావ‌డం ఏంట‌ని, ఇన్ని రోజులు ఏం చేశార‌ని పిటిషనర్ ను కోర్టు ప్ర‌శ్నించింది. ఇప్పటికే పరీక్షలు ప్రారంభమయ్యాయ‌ని, ఇక‌ దీనిపై జోక్యం చేసుకోలేమని తెలిపింది. లంచ్‌మోషన్ పిటిషన్‌కు అనుమతి ఇవ్వ‌బోమ‌ని చెప్పింది.

మంత్రి స‌బితా నివాసం ముట్ట‌డి..

మరోవైపు డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసాన్ని ఈ రోజు ఉద‌యం విద్యార్థులు ముట్టడించారు. ఇంజనీరింగ్‌, డిగ్రీ పరీక్షలు వాయిదా వేయడం లేదా ఆన్‌లైన్‌లో నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులంతా 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉంటార‌ని అంద‌రూ పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకోని నేప‌థ్యంలో ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయాల‌ని కోరారు. ఈ క్ర‌మంలో మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి.. విద్యార్థుల‌తో మాట్లాడారు.

ప‌రీక్ష‌ల‌పై నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు. విద్యార్థులు ఎక్క‌డ కోరితే అక్క‌డ ప‌రీక్షా కేంద్రాలు ఉండేలా అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని చెప్పారు. ప‌రీక్ష‌ల వాయిదాపై ఇప్ప‌టికిప్పుడే నిర్ణ‌యం తీసుకోలేమ‌న్నారు. అన్ని అంశాల‌ను ప‌రిశీలించిన అనంత‌రం.. ల‌క్ష‌లాది మంది విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. స్ప‌ష్టమైన వైఖ‌రి చెప్పాల‌ని విద్యార్థులు డిమాండ్ చేయ‌డంతో పాటు మంత్రి నివాసానికి స‌మీపంలోని రోడ్డుపై బైఠాయించగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story