ప్రభుత్వం కీలక నిర్ణయం.. తెలంగాణలోకి సీబీఐకి నో ఎంట్రీ
TS Govt withdraws permission for CBI investigation in state.
By తోట వంశీ కుమార్ Published on 30 Oct 2022 6:18 AM GMTతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) దర్యాప్తునకు ఇచ్చిన అనుమతి వెనక్కి తీసుకుంది. గతంలో ఏ కేసులోనైనా కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేసుకునేందుకు అనుమతి ఉండేది. తాజాగా దీన్ని వెనక్కు తీసుకుంది.ఇందుకు సంబంధించి ఆగస్టు 30న జీవో 51ను ప్రభుత్వం జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో ఏ కేసునైనా సీబీఐ దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణాల నేపథ్యంలో సీబీఐ కేసులు పెట్టే అవకాశం ఉందన్నప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ప్రభుత్వం రెండు నెలల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ అవినీతి నిరోధక చట్టం – 1988, ఐపీసీలోని పలు సెక్షన్లతో ఢిల్లీలో తప్ప దేశంలోని ఏ రాష్ట్రంలోనూ సీబీఐ నేరుగా వెళ్లి దర్యాప్తు చేసేందుకు వీలు లేదు. ఇందు కోసం రాష్ట్రాలు జనరల్ కన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలో సాధారణ సమ్మతి ఇచ్చి, తర్వాత కాలంలో వాటికి రద్దు చేసిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. 2018లో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ సీబీఐకు ఇచ్చిన సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంది.