ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజును కాళోజీ అవార్డు వరించింది. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి తెలంగాణ ప్రభుత్వం ఏటా పద్మ విభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుతో అవార్డు ప్రకటిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సుల మేరకు 2023 సంవత్సరానికి గానూ కాళోజీ నారాయణరావు అవార్డుకు జయరాజును సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు.
ఈ నెల 9వ తేదీన కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా నిర్వహించే అధికారిక కార్యక్రమంలో ఈ అవార్డును జయరాజుకు అందించనున్నారు. అవార్డు కింద రూ.1,01,116 నగదుతో పాటు జ్ఞాపికను అందించి జయరాజును సత్కరించనున్నారు. పేద దళిత కుటుంబానికి చెందిన జయరాజు వివక్ష లేని సమసమాజం కోసం తనవంతుగా సాహిత్యంతోనూ, తన గానంతోనూ కృషి చేశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో తన సాహిత్యంతో ప్రజలను ఉత్తేజపరిచారు. మంచి వాగ్గేయకారునిగా పేరు తెచ్చుకున్నారు జయరాజు. ఆయనకు అవార్డు దక్కడంపై పలువురు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.