తెలంగాణ శాసనసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్యేలు హైకోర్టు సూచనలతో మంగళవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిశారు. తమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తి వేయాలని రఘునందన్‌రావు, రాజాసింగ్, ఈటల రాజేందర్‌లు కోరారు. అయినప్పటికీ వారికి నిరాశే ఎదురైంది. బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి అనుమతించలేదు. సభ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో వారు వెళ్లిపోయారు. తమ అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించారని బీజేపీ ఎమ్మెల్యేలు తెలిపారు. అంతకముందు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులతో భేటీ అయ్యారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రతిని ఆయనకు అందజేవారు. కాగా.. నేటితో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి.
శాసనసభ సమావేశాలకు అనుమతించాలని సస్పెండ్ అయిన ఎమ్మెల్యే లు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై స్పీకర్ దే తుదినిర్ణయమని హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. శాసనసభ్యులను సహేతుకమైన కారణాలు లేకుండానే సస్పెండ్ చేయడం వారి హక్కులను హరించడమేనని న్యాయస్థానం అభిప్రాయపడింది. రాజ్యాంగ అత్యున్నత హోదాలో ఉన్న స్పీకర్‌కు ఎలాంటి ఆదేశాలివ్వబోమని తెలిపింది. శాసన సభ సమావేశాలకు మంగళవారం చివరి రోజు కావంతో స్పీకర్ ఏదో ఒక తీసుకోవాలని న్యాయస్థానం తెలిపింది. ఈ ఆర్డర్ కాపీతో సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలు నేడు అసెంబ్లీకి వచ్చారు.