రేపటి నుంచే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
TS Assembly budget session from Monday. తెలంగాణ రాష్ట్ర శాసనసభ, మండలి 2022-23 బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
By అంజి Published on 6 March 2022 9:11 AM IST
తెలంగాణ రాష్ట్ర శాసనసభ, మండలి 2022-23 బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలిరోజు అసెంబ్లీలో 2022-23 రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ రెండో శాసనసభ ఎనిమిదో సమావేశానికి ఇది రెండో సమావేశం కాగా, తెలంగాణ శాసనమండలి 18వ సెషన్‌లో రెండో సమావేశం. అందుకనుగుణంగా బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు శనివారం శాసనసభ ఆవరణలోని అసెంబ్లీ కమిటీ హాల్‌లో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మార్చి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను స్పీకర్ ఆదేశించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ శాసనసభలో పారదర్శకంగా, సమర్ధవంతంగా కార్యకలాపాలు సాగుతున్నాయన్నారు. బడ్జెట్ సమావేశాలను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు సభ్యులు, అధికారుల మద్దతు కోరారు. గత సమావేశాల మాదిరిగానే, ప్రభుత్వం అసెంబ్లీలో ఆయా శాఖల తరపున ప్రత్యేక నోడల్ అధికారులను నియమించి, సభ్యులు కోరిన మొత్తం సమాచారాన్ని వీలైనంత త్వరగా అందించాలని ఆయన కోరారు. గత సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలన్నింటికీ వెంటనే సమాధానాలు పంపేలా చూడాలని ఆయన కోరారు.
కోవిడ్ -19 ప్రభావం తగ్గుముఖం పట్టినప్పటికీ, కోవిడ్ ప్రోటోకాల్‌ను ఖచ్చితంగా పాటించాలని శ్రీనివాస్ రెడ్డి సభ్యులు, అధికారులను ఆదేశించారు. సెషన్‌లో కోవిడ్ మార్గదర్శకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో కోవిడ్-19 కేసులను సమర్థవంతంగా అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఏవైనా లక్షణాలతో బాధపడుతున్న వారిని పరీక్షించేందుకు అసెంబ్లీ ఆవరణలో కోవిడ్-19 పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖను ఆదేశించారు.