ఉప రాష్ట్రపతి ఎన్నికలు : ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థికి టీఆర్ఎస్ మద్దతు

TRS to support opposition's Margaret Alva. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ ఆల్వాకే మద్దతు

By Medi Samrat  Published on  5 Aug 2022 9:05 AM GMT
ఉప రాష్ట్రపతి ఎన్నికలు : ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థికి టీఆర్ఎస్ మద్దతు

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ ఆల్వాకే మద్దతు ఇస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి మార్గరెట్ ఆల్వాకు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు వెల్లడించారు. టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ, లోక్ సభ సభ్యులు కలిపి మొత్తం 16 మంది ఇందుకు అనుగుణంగా ఓటు వేయాలని ఆదేశించారు. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే తరఫున జగదీప్ ధన్ కర్ పోటీ చేస్తుండగా.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా లోక్ సభ, రాజ్యసభ సభ్యులు కలిపి మొత్తం 788 మంది ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఇప్పటివరకు.. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM), ఇతరులు ఆల్వాకు మద్దతునిచ్చారు. ఆల్వా పేరును ప్రకటించే ముందు తమను సంప్రదించలేదని ఆరోపిస్తూ లోక్‌సభలో 23 మంది, రాజ్యసభలో 16 మంది ఎంపీలతో కూడిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. జూలై 17న, 17 పార్టీల ఉమ్మడి ప్రతిపక్షం ఉపాధ్యక్ష అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వాను ఎంపిక చేసింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మార్గరెట్ ఆల్వా నామినేషన్‌ను ప్రకటించారు. ఆమెకు శివసేన నుంచి కూడా మద్దతు లభించింది.

మార్గరెట్ ఆల్వా గోవాకు 17వ గవర్నర్‌గా, గుజరాత్‌కు 23వ గవర్నర్‌గా, రాజస్థాన్‌కు 20వ గవర్నర్‌గా, ఉత్తరాఖండ్‌కు 4వ గవర్నర్‌గా పనిచేశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10వ తేదీన పూర్తికానుంది. ఈ మేరకు ఉప రాష్ట్రపతి ఎన్నికలకు ఆగస్టు 6న పోలింగ్ జరుగనుంది.



Next Story