ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు వచ్చాయంటూ ఈ ఉదయం నుంచి కథనాలు వెల్లువెత్తాయి. దీనిపై కవిత సోషల్ మీడియాలో స్పందించారు. ఈడీ నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు. తాను ఈ వాస్తవాన్ని వెల్లడించడం ద్వారా టీవీ ప్రేక్షకుల విలువైన సమయాన్ని ఆదా చేయాలనుకుంటున్నానని తెలిపారు. ఢిల్లీలో కూర్చుని దుష్ప్రచారం చేస్తున్న కొందరు వ్యక్తులు మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేసే కంటే వాస్తవాలనే ప్రచారం చేస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీడియా సంస్థలన్నింటినీ కోరుతున్నానని కవిత చెప్పుకొచ్చారు.
దేశవ్యాప్తంగా 40కి పైగా ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహిస్తోంది. ఢిల్లీ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో 25 బృందాలతో ఈడీ తనిఖీలు చేపట్టింది. అభినవ్‌రెడ్డి, అభిషేక్, ప్రేమ్‌సాగర్‌రావు, అరుణ్ పిళ్ళై ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, కోకాపేట, దోమలగూడలో తనిఖీలు నిర్వహించారు. ఇందిరాపార్క్ దగ్గర శ్రీసాయికృష్ణ రెసిడెన్సీలో ఈడీ సోదాలు చేపట్టింది.