మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ముగిసినా ఇంకా పొలిటికల్ హీట్ చల్లారడం లేదు. నేతలు పార్టీలు మారుతున్నారంటూ ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. నేడు భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ ను వీడగా.. ఆయన బాటలోనే మరికొందరు పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. టీఆర్ఎస్ నేత, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆ పార్టీని వీడుతున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతుంది.
అయితే.. ఈ వార్తలపై ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు. తాను బీజేపీలోకి వెళ్తున్నట్టు సోషల్ మీడియాలో కొందరు నాపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తనను రాజకీయంగా ఎదుర్కొలేక చీఫ్ ట్రిక్స్ ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. నాకు పార్టీ మారాల్సిన అవసరం లేదు.. ఆ అవసరం రాదు కూడా అని స్పష్టత ఇచ్చారు. పని పాటా లేని కొందరు మాత్రం దుష్ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు. అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మొద్దు. ఎవరెన్ని కుట్రలు చేసినా మునుగోడు గడ్డపై ఎగిరేది గులాబీ జెండానే.. మళ్ళీ తెలంగాణ లో అధికారంలోకి వచ్చేది కూడా టీఆర్ఎస్ పార్టీనే అని పేర్కొన్నారు. కేసీఆర్ పాలన కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కర్నె ప్రభాకర్ కూడా పార్టీ మారడం లేదని తెలుస్తోంది.