ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు శనివారం టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు నివాళులర్పించారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా తెలంగాణ మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ఆరెకపూడి గాంధీ ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు.
మీడియాతో నామా నాగేశ్వరావు మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను కేంద్రం ప్రకటించాలని పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలు డిమాండ్ చేస్తామని తెలిపారు. మల్లారెడ్డి కూడా ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డ్‌ను అందించాలని కోరారు. ఇదిలావుంటే.. మంత్రులు ఒక్కసారిగా ఎన్టీఆర్ రాగం అందుకోవడం పట్ల హైద్రాబాద్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న ఆంధ్రా ఓటర్ల ఓట్లను తమవైపు తిప్పుకోవాలని టీఆర్‌ఎస్ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా ఎన్టీ రామారావు శత జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. తన తండ్రి స్వర్గీయ ఎన్టీ రామారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో ఆమె తన తండ్రి సమాధికి నివాళులర్పించారు. త్వరలో 100 రూపాయల నాణెంపై ఎన్టీఆర్ చిత్రం ఉంటుందని, దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో చర్చలు జరుపుతున్నామని ఆమె పేర్కొన్నారు.