రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను అధిస్టానం ప్రకటించింది. హెటిరో గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బండి పార్థసారధిరెడ్డి, వ్యాపారవేత్త వద్దిరాజు రవిచంద్ర (అలియాస్ గాయత్రి రవి), తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దామోదర్ రావు అభ్యర్ధులుగా ఫైనల్ చేసింది. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ముగ్గురు అభ్యర్థులకు వారి ఎంపిక గురించి సమాచారం అందించిన అధిస్టానం అనంతరం అభ్యర్థులను అభినందించారు. ముగ్గురు అభ్యర్ధులను వీలైనంత త్వరగా తమ నామినేషన్లను దాఖలు చేయాలని కోరారు.
హెటెరో గ్రూప్‌ను భారతదేశంలో అతి పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీగా, యాంటీ రెట్రోవైరల్ ఔషధాల ఉత్పత్తిలో ప్రపంచ అగ్రగామిగా ఎదగడంలో పార్థసారధి రెడ్డి కీలక పాత్ర పోషించారు. వద్దిరాజు రవి చంద్ర గ్రానైట్ వ్యాపారి.. కొన్ని ఎన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. 2018లో వరంగల్ అర్బన్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విఫలమయ్యారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి పార్టీ కోసం పనిచేస్తున్నారు.
దామోదర్ రావు లా గ్రాడ్యుయేట్. టిఆర్ఎస్ పార్టీ ప్రారంభించినప్పటి నుండి సభ్యుడిగా ఉన్నారు. మొదటి నుండి కేసీఆర్‌తో ఉంటూ సన్నిహితంగా పనిచేశారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే వార్తాపత్రికలను ప్రచురించే తెలంగాణా పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆయన సేవలందించారు.