కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైన పార్టీ నాయకులు, కార్యకర్తలు

TRS cadre gear up to celebrate KCR’s birthday. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

By Medi Samrat  Published on  17 Feb 2022 3:59 AM GMT
కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైన పార్టీ నాయకులు, కార్యకర్తలు

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు రక్తదాన శిబిరాల్లో పాల్గొనడమే కాకుండా పండ్లు, ఆహారాన్ని పంపిణీ చేస్తూ మూడు రోజుల వేడుకలను ఇప్పటికే ప్రారంభించారు. మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులతో పాటు పలువురు నేతలు ఇప్పటికే కేక్‌ కట్‌ వేడుకలు, ప్రత్యేక పూజలు, హోమాలు, సర్వమత ప్రార్థనలు, చీరలు, పండ్లు, అన్నదానం తదితర ఏర్పాట్లు చేశారు.

తెలంగాణ భవన్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ నిర్వహించనున్న వేడుకల్లో ఓ డాక్యుమెంటరీని విడుదల చేయనున్నారు. బల్కంపేట ఆలయంలో ఎల్లమ్మ అమ్మవారికి బంగారు ఆభరణాలను ఎమ్మెల్సీ కె.కవితతో కలిసి శ్రీనివాస్ యాదవ్ సమర్పించనున్నారు. హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీతో పాటు పలువురు నాంపల్లి దర్గా వద్ద 'చద్దర్' అందజేయగా, మరికొందరు అమీర్‌పేటలోని గురుద్వారాతో పాటు సికింద్రాబాద్ ప్రాంతంలోని చర్చిలలో ప్రార్థనలు చేస్తారు.

మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల జరిగిన రక్తదాన శిబిరాల్లో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తదితరులు పాల్గొని రక్తదానం చేశారు. ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల్లో క్రీడా పోటీలను నిర్వహించారు. గురువారం తమ జిల్లాల్లో జరిగే జన్మదిన వేడుకల్లో ఇంధన శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు పలువురు పాల్గొననున్నారు. నిరుపేదలకు సహాయం చేయడానికి 'గిఫ్ట్ ఎ స్మైల్' కార్యక్రమం కింద పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు పలు కార్య‌క్ర‌మాల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించ‌నున్నారు.

బుధవారం టీఆర్‌ఎస్‌ నేతలు తమ పార్టీ అధ్యక్షుడిపై ఉన్న ప్రేమ, గౌరవం, ఆప్యాయతలను చాటుకున్నారు. న్యూఢిల్లీ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసితో పాటు పలు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు, డిజిటల్ పోస్టర్‌లు ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌, మహేశ్వర్‌రెడ్డి ముఖ్యమంత్రి గత ఏడేళ్లలో సాధించిన విజయాలను వివరిస్తూ ఇసుక శిల్పాలను ఏర్పాటు చేశారు. ఇక, మహేశ్ బిగాల నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ఎన్నారై విభాగం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వేడుకలను నిర్వహించింది. చంద్రశేఖర్ రావు దూరదృష్టి గల వ్యక్తి అని పేర్కొంటూ, రాష్ట్రంలోని పలువురు ఎన్నారైలు మొక్కలు నాటారు, కేక్ కట్ చేసి రక్తదానం చేశారు.


Next Story