బతుకమ్మ పండుగ వేళ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. బతుకమ్మ ఆడుతుండగా గుండెపోటు రావడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఆదివారం నాడు చోటు చేసుకున్న ఈ ఘటనలు.. వేర్వేరు ప్రాంతాల్లో జరిగాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెంకు చెందిన శెట్టి మౌనిక (31) ఈ నెల 21న ఎంగిలిపూల బతుకమ్మ ఆడేందుకు తన ఇద్దరు కూతుళ్లు, కుమారునితో కలిసి గ్రామంలోని గుడి వద్దకు వెళ్లింది. అక్కడ అందరూ మహిళలు బతుకమ్మ ఆడుతున్న సమయంలో డీజే సౌండ్‌తో మౌనిక అస్వస్థతతో కుప్పకూలారు.
ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించారు. అయితే ఆమె గుండెపోటు కారణంగా మరణించినట్టు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అటు సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం మాచిరెడ్డిపల్లిలో మేఘన(24) బతుకమ్మ ఆడుతూ ఛాతీనొప్పితో కుప్పకూలిపోయింది. వెంటనే అక్కడున్న మహిళలు జహీరాబాద్‌లోని ప్రభ్వుత ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు.