హోలీ పండగ వేళ విషాదం.. వేర్వేరు ఘటనల్లో 17 మంది మృతి

నిన్న హోలీ పండుగ తెలంగాణలోని పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వేరు వేరు ఘటనల్లో 17 మంది దుర్మరణం చెందారు.

By అంజి  Published on  26 March 2024 8:24 AM IST
Holi festival, Telangana, Warangal

హోలీ పండగ వేళ విషాదం.. వేర్వేరు ఘటనల్లో 17 మంది మృతి

నిన్న హోలీ పండుగ తెలంగాణలోని పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వేరు వేరు ఘటనల్లో 17 మంది దుర్మరణం చెందారు. రంగులు చల్లుకున్న తర్వాత స్నానానికి నదులు, చెరువుల్లోకి దిగి 16 మంది మరణించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఏడుగురు, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఆరుగురు, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు, జగిత్యాలలో ఒకరు మృతి చెందారు. నారాయణపేటలో నీటి ట్యాంక్‌ కూలి ఓ చిన్నారి కన్నుమూసింది.

నారాయణపేట జిల్లా కేంద్రంలో హోలీ సంబురాల్లో చిన్నారులు నిమగ్నమై ఉండగా.. పక్కనున్న వాటర్‌ ట్యాంక్‌ ఒక్కసారిగా కూలిపడింది. ఈ క్రమంలోనే లక్ష్మీప్రణీత(12) తీవ్రగాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ లక్ష్మీప్రణీత చనిపోయింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నందుపల్లికి చెందిన ఇద్దరు చెరువులో పడి మృతి చెందారు. ఇద్దరు హోలీ ఆడుకొని నందపల్లి పెద్ద చెరువు దగ్గరకు ఈతకు వెళ్లారు. ఇద్దరు చెరువులోకి దిగి ఈత కొడుతూ కనిపించకుండాపోయారు. స్థానికులు ఇద్దరు మృతదేహాలను బయటకు తీశారు.

కుమ్రం భీం జిల్లా కౌటాల మండల కేంద్రానికి చెందిన ఆరుగురు స్నేహితులు హోలీ సంబరాలు చేసుకుని, తాటిపెల్లి పెన్‌గంగాలో స్నానానికి వెళ్లారు. అక్కడ నీట మునిగి ఆలం సాయి(23), ఉప్పుల సంతోష్‌(23), ఎలుములే ప్రవీణ్‌(24), పనస కమలాకర్‌(23)లు మృతి చెందారు. జగిత్యాల జిల్లా రాయికల్‌లో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న నర్ర నాగేష్‌(21).. హోలీ వేడుకలకు వీరాపూర్‌ శివారులోని మామిడితోటకు వెళ్లాడు. అక్కడ వ్యవసాయ బావిలో దిగి నీటమునిగి మృతి చెందాడు. ఆదిలాబాద్‌లోని జైజవాన్‌నగర్‌కు చెందిన గుమ్ముల సాత్విక్‌(14) భీంసారి వాగులో స్నానానికి వెళ్లి మృత్యువాత పడ్డాడు. మంచిర్యాల జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన గోపులపురం కార్తీక్‌(18).. దండేపల్లి మండలం మామిడిపల్లిలో కడెం కాలువలో నీట మునిగి మృతి చెందాడు.

సోమవారం పలివేల్పులలోని ఎస్సారెస్పీ కాల్వలోకి దిగిన కూతురిని కాపాడే ప్రయత్నంలో తండ్రి కేదారేశ్వర్‌, మరో వ్యక్తి క్రాంతి గల్లంతయ్యారు. అటుగా వచ్చిన మరో వ్యక్తి కాల్వలోకి దూకి పాపను కాపాడాడు. అప్పటికే కేదారేశ్వర్‌, క్రాంతి గల్లంతయ్యారు. స్థానికులు కాల్వలో గాలించగా కేదారేశ్వర్‌ మృతదేహం లభ్యమైంది. సోమవారం రాత్రి క్రాంతి మృతదేహం లభించింది. ఇదిలా ఉంటే.. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం శ్రీరాములపల్లికి చెందిన రాపాక బ్రహ్మచారి (35) హోలీ వేడుకల్లో పాల్గొని ఎస్సారెస్పీ కాలువలో స్నానం చేసేందుకు వెళ్లి.. ప్రవాహంలో కొట్టుకుపోయి మృతిచెందాడు. మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెంకు చెందిన రిత్విక్‌రెడ్డి(10) స్నేహితులతో ఈతకు వెళ్లి చెరువులో మునిగి మృతి చెందాడు.

ఇదిలా ఉంటే.. ములుగు జి లక్ష్మీదేవిపేటకు చెందిన ఎంబడి శ్రుశాంత్‌(22), తిమ్మాపూర్‌కి చెందిన ఉమ్మడి ఉమేష్‌(22) బైక్‌పై వెళ్తూ చెట్టుకు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు. హనుమకొండ జిల్లా చర్లపల్లికి చెందిన శనిగరపు వంశీ (23) మిత్రులతో హోలీ వేడుకలు చేసుకుని.. ఆటోలో ఇంటికెళ్తుండగా వాహనం బోల్తాపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

Next Story