ఒకే ఒక్క ఫోటో క్లిక్ మనిపించిన ట్రాఫిక్ పోలీసు.. ఏకంగా ఆరు చలాన్లు..!

Traffic Challan Goes Viral. కొందరు రోడ్డు మీదకు వచ్చే సమయంలో కనీసం ట్రాఫిక్ నియమాలు పాటించరు.

By Medi Samrat  Published on  10 Jun 2021 3:04 PM GMT
ఒకే ఒక్క ఫోటో క్లిక్ మనిపించిన ట్రాఫిక్ పోలీసు.. ఏకంగా ఆరు చలాన్లు..!

కొందరు రోడ్డు మీదకు వచ్చే సమయంలో కనీసం ట్రాఫిక్ నియమాలు పాటించరు. హా మనల్ని ఎవరు చూస్తారులే.. పోలీసులకు కనిపించకుండా వెళ్ళిపోదాం అని అనుకుంటూ ఉంటారు. పోలీసులు అంత దూరంలో కనిపించగానే వేరే రూట్ లో వెళ్లిపోయే కిలాడీ బైక్ డ్రైవర్లు ఎంతో మంది ఉన్నారు. ఇక ఫైన్ తక్కువే కదా కట్టేసుకుందాం అని చాలా లైట్ గా తీసుకునే వాళ్లు కూడా ఉంటారు. ఏ మాత్రం బాధ్యత లేకుండా హెల్మెట్ లేకుండా వెళ్లే వాళ్లు కొందరు.. ఫ్రెండ్షిప్ ముఖ్యమంటూ ట్రిపుల్ రైడింగ్ వెళ్లే వాళ్లు ఇంకొంత మంది ఉంటారు.. ఇక మొబైల్ చూసుకుంటూ బైక్ డ్రైవింగ్ చేసే వారు మరికొందరు.. కరోనా మహమ్మారి విపరీతంగా ప్రబలుతున్న సమయంలో మాస్క్ పెట్టుకోమని ఎంతగా మొత్తుకుంటున్నా.. మాస్క్ పెట్టుకోకుండా ఉన్న వాళ్లు చాలా మందే ఉన్నారు.. ఇలా ఇన్ని నియమాలను ఉల్లంఘిస్తూ ట్రాఫిక్ పోలీసులకు ఒకే బైక్ అడ్డంగా దొరికిపోయింది.

ఏకంగా ఆరు చలాన్లు ఆ బైక్ మీద పడ్డాయి.హైద‌రాబాద్‌కు చెందిన ముగ్గురు యువ‌కులు రోడ్డు నిబంధనలు ఉల్లంఘించారు. నడిరోడ్డుపై విన్యాసాలు చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఈ ఫొటోను సైబ‌రాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు. కమిషనరేట్ పరిధిలో ముగ్గురు యువ‌కులు ఓ బైక్‌పై వెళుతున్నారు. మ‌ధ్యలో కూర్చున్న వ్యక్తి త‌న రెండు చేతుల‌ను డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని చుట్టేసి మొబైల్ ఫోన్ ప‌ట్టుకున్నాడు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఆ ఫోన్‌లో చూస్తున్నాడు. వాళ్లకి మాస్కులు ఉన్నా సరిగ్గా పెట్టుకోలేదు. హెల్మెట్ కూడా లేదు. అక్కడే ఉన్న ఓ ట్రాఫిక్ పోలీసు దీన్ని ఫోటో తీసేశారు. ''రోడ్డుపై టైటానిక్ విన్యాసాలు.. ప‌ట్టుత‌ప్పితే మునిగిపోతాయి ప్రాణాలు'' అంటూ ట్వీట్ చేయడంతో వైరల్ అయింది.

ఒకే సమయంలో ఆరు ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించారు. బైక్ వెన‌కాల కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధ‌రించని కార‌ణంగా రూ.100, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌కు రూ.1,000, బ‌హిరంగ ప్రదేశాల్లో మాస్కు స‌రిగ్గా ధ‌రించ‌నందుకు రూ.1000, డ్రైవ‌ర్ హెల్మెట్ ధ‌రించ‌ని కార‌ణంగా రూ.200, వెనుక చూసేందుకు సైడ్ మిర్రర్స్ లేని కారణంగా మరో రూ.100, ట్రిపుల్ రైడింగ్‌కు రూ.1200 ఇలా జరిమానా విధించారు.


Next Story