ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో డెడ్‌బాడీ ఆనవాళ్లు!
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో మరో మృతదేహం ఆనవాళ్లు లభించినట్టు సమాచారం.
By అంజి
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో డెడ్‌బాడీ ఆనవాళ్లు!
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో మరో మృతదేహం ఆనవాళ్లు లభించినట్టు సమాచారం. మినీ ఎక్స్‌కవేటర్ ఉపయోగించి తవ్వకం చేస్తున్న సమయంలో కన్వేయర్ బెల్ట్‌కు 50 మీటర్ల దూరంలో మృతదేహాం ఆనవాళ్లు లభించినట్టు గుర్తించారు. వెంటనే మృతదేహాన్ని వెలికితీసే ప్రక్రియను సహాయక బృందాలు ప్రారంభించాయి. ఆనవాళ్లు మృతదేహానివైతే సాయంత్రం బయటకు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
బాడీని వెలికి తీసిన తర్వాత.. అతడిని గుర్తించడానికి కొంత సమయం పట్టవచ్చని అధికారులు తెలిపారు. అయితే మృతదేహం విషయాన్ని అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. తప్పిపోయిన మరో ఆరుగురు కార్మికులను గుర్తించడంపై బృందాలు దృష్టి సారించడంతో శోధన కార్యకలాపాలు కొనసాగాయి. నెల రోజుల క్రితం టన్నెల్‌లో 8 మంది చిక్కుకోగా ఇటీవల ఓ ఇంజినీర్ డెడ్‌బాడీని వెలికితీశారు.
ఇదిలా ఉంటే.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాద ఘటనలో సహాయక చర్యలను కొనసాగించాలని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సహాయక చర్యల నిరంతర పర్యవేక్షణకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటనలో ఇప్పటివరకు జరిగిన సహాయక చర్యల్లో పురోగతిని ముఖ్యమంత్రి సహచర మంత్రివర్గ సభ్యులు ఇతర ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు ఇప్పటివరకు చేపట్టిన చర్యలను వివరించారు.