ఆశావహులు దరఖాస్తు చేసుకోండి.. హుజురాబాద్ అభ్య‌ర్థి ఎంపిక‌పై కాంగ్రెస్ క‌స‌ర‌త్తు ప్రారంభం

TPCC Working President Mahesh Kumar. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ నుండి బ‌రిలో ఉండ‌ద‌లిచిన‌ ఆశావహులు

By Medi Samrat  Published on  31 Aug 2021 1:27 PM GMT
ఆశావహులు దరఖాస్తు చేసుకోండి.. హుజురాబాద్ అభ్య‌ర్థి ఎంపిక‌పై కాంగ్రెస్ క‌స‌ర‌త్తు ప్రారంభం

హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ నుండి బ‌రిలో ఉండ‌ద‌లిచిన‌ ఆశావహులు రేపు ఉద‌యం 10 గంటల నుండి 5వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ తెలిపారు. ఆశావహులు అప్లికేషన్ ఫారంతో పాటు రూ.5వేల రూపాయల డీడీ ఇవ్వాలని అన్నారు. 6న పీసీసీ నుండి సీనియర్ బృందం ఇంటర్వ్యూ చేస్తారని తెలిపారు. ఈ మేర‌కు భట్టి విక్ర‌మార్క‌, దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్ర‌భాక‌ర్‌, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబుతో పాటు వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్ రెడ్డి, కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణ కమిటీ సభ్యులుగా వుంటారని తెలిపారు. అభ్యర్థి ఎంపిక‌పై సెప్టెంబ‌ర్‌ 10 తర్వాత ఏఐసీసీకి నివేదిక వెళ్తుంది. ఆ తర్వాత అభ్యర్థి పేరు ప్రకటన వస్తుందని తెలిపారు.

బండి సంజయ్.. నిజాం ఆస్తుల విషయం తీసుకొచ్చి మతాలను రెచ్చగొడుతున్నారని మహేష్ కుమార్ ఫైర్ అయ్యారు. రాజా సంస్థానాలు, రాజా ఆభరణాలు రద్దు చేసిన ఘనత.. సీలింగ్ ల్యాండ్స్ ఎత్తివేసిన ఘనత ఇందిరా గాంధీది అన్నారు. 7 ఏళ్లుగా మోదీ సర్కార్ కు నిజాం ఆస్తులు కనిపించలేదా..? కేంద్ర, రాష్ట్ర సర్కార్ లు ఆడుతున్న డ్రామా అని ఫైర్ అయ్యారు. ప్రజలను రెచ్చగొట్టడానికే ఈ త‌ర‌హా కామెంట్స్ చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప్రజా సంగ్రామ యాత్ర ఎవరి కోసం.. ఎవరు చేస్తున్నారు.. పెట్రోల్, డీజిల్, సిలిండర్ ధరలు పెంచి పాద‌యాత్రలు చేస్తున్నారా..? అని ఫైర్ అయ్యారు. ఎన్నిక‌ల బ‌రిలో ఉండాల‌నుకునే ఆశావహుల నుండి డబ్బులు వసూల్ చేయడం అనేది పాత పద్ద‌తే అని.. సీనియర్లు టికెట్‌ స్థానికులకే ఇవ్వాలని అంటున్నారని మహేష్ కుమార్ అన్నారు.


Next Story