నేను రాజకీయం చేస్తున్నప్పుడు రఘునందన్ గల్లీలో గోళీలు ఆడుతున్నాడు : జ‌గ్గారెడ్డి

ఐటీఐఆర్ మంజూరు చేసే వరకూ మాట్లాడుతూనే ఉంటాన‌ని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  26 Jun 2024 1:36 PM GMT
నేను రాజకీయం చేస్తున్నప్పుడు రఘునందన్ గల్లీలో గోళీలు ఆడుతున్నాడు : జ‌గ్గారెడ్డి

ఐటీఐఆర్ మంజూరు చేసే వరకూ మాట్లాడుతూనే ఉంటాన‌ని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి అన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను కలిసి వినతిపత్రం ఇస్తాన‌ని పేర్కొన్నారు. కేంద్రంలో ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత మేము నిర్వహిస్తామ‌న్నారు. అధికార పార్టీగా ఐటీఐఆర్ మంజూరు చేయండని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఐటీఐఆర్ మంజూరు చేసినప్పుడు రఘునందన్ రావు టీఆర్ఎస్‌లో ఉన్నారని గుర్తుచేశారు. 1980లో రాజకీయంగా బీజేపీకి గుర్తింపు లేదని అన్నారు.. నాకష్టంతోనే రాజకీయంగా ఎదిగానని.. కాబట్టి తల్లిపాత్ర ఆరోజుల్లో నాదే.. అప్పుడు నా వయసు 15 ఏండ్లని జ‌గ్గారెడ్డి అన్నారు.

ఐదు రోజుల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియాగాంధీ.. మన్మోహన్ సింగ్ ఇచ్చిన ఐటీఐఆర్ గురించి మాట్లాడాను.. యువతకు ఉద్యోగాల అంశం కాబట్టి మాట్లాడాన‌ని స్ప‌ష్టం చేశారు. 2014 తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చి ఐటీఐఆర్ రద్దు చేశారు.. వాస్తవం కాబట్టి మాట్లాడాన‌న్నారు. అవగాహన లేకుండా.. అనాలోచితంగా కూడా మాట్లాడలేదన్నారు. మోదీ రద్దు చేయకపోయి ఉంటే పదేళ్ళలో 15 లక్షల ఉద్యోగాలు వచ్చేవన్నారు. ఆధారాలతోనే నేను మాట్లాడిన.. ఇప్పుడు ఆధారాలు కూడా చూపెడుతున్నాన‌ని చూపించారు.

ఇది రాజకీయ విమర్శ కాదు.. ప్రభుత్వం మీద విమర్శ చేయాలని చేస్తుంది కాదన్నారు. ఐటీఐఆర్ మళ్ళీ తీసుకుని రావాలని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు. హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న నాలుగు ఎంపీ సీట్లను బీజేపీకే ఇచ్చారు ప్రజలు.. రఘునందన్ రావు.. మీకు ప్రజలు బాధ్యత ఇచ్చారు కాబట్టి అడుగుతున్నామ‌న్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసి ఉంటే.. మేమే ఐటీఐఆర్ తెచ్చే వాళ్ళమ‌న్నారు. మేము ప్రతిపక్ష పార్టీగా ఐటీఐఆర్ కావాలని అడుగుతున్నాం.. మంజూరు చేయించి మీరే క్రెడిట్ తీసుకోండన్నారు.

పార్లమెంట్ సమావేశాలు అయిపోయాక కిషన్ రెడ్డి, సంజయ్ ని కలిసి వినతిపత్రం ఇస్తాన‌ని తెలిపారు. రద్దు అయిన ఐటీఐఆర్ మళ్ళీ తీసుకురండ‌ని అడుగుతాన‌న్నారు. సెప్టెంబర్‌లో ఐటీఐఆర్ అనుమతి వచ్చింది.. ITIR ఏర్పాటుకు 50 వేల ఎకరాల్లో పెట్టాలని.. 60 లక్షల ఉద్యోగాలు వచ్చేవి అని అంచనా వేశారు. 2016 ఏప్రిల్ లో మోదీ ప్రభుత్వం ఐటీఐఆర్ పక్కన పెట్టిందని తెలిపారు.

ఇప్పటికైనా 8 మంది ఎంపీలు రాజ్యసభ ఎంపీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఐటీఐఆర్ తేవాలన్నారు. ఐదు రోజులకు ఒకసారి దీని మీద మాట్లాడతాన‌న్నారు. రూలింగ్ పార్టీకి గుర్తు చేయడమే మా బాధ్యత కాబట్టి గుర్తుచేస్తున్నామ‌న్నారు.

రఘునందన్ రావు.. నాకు ఐటీఐఆర్ గురించి ఆ ఆ లు కూడా రావన్నారు. నా మీద విమర్శ చేస్తే లోపాలు ఉంటే ఒప్పుకుంటా. ఎడ్యుకేషన్ పరంగా నేను చాలా వీక్.. నేను ఇంటర్ పెయిల్‌... రఘునందన్ అడ్వకేట్.. చాలా తెలివి ఉంది.. ఆయన పుస్తకాలు చదివాడు.. నేను జీవితాన్ని చదివాన‌న్నారు. మెరిట్ స్టూడెంట్ కి అనుభవాలు ఉండవన్నారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దాడు అని రఘునందన్ అంటున్నాడు.. ఆర్ఎస్ఎస్‌ శాఖకు వెళ్లినా.. తప్పేముందని ప్ర‌శ్నించారు. నేను శాఖకు వెళ్ళేటప్పుడు రఘునందన్ ఎక్కడ ఉన్నాడని ప్ర‌శ్నించారు. శాఖల గురించి ఆయనకు తెలియదు.. ఆయన డైరెక్ట్ వచ్చాడు కాబట్టి ఆయనకు ఏం తెలుసన్నారు.

జగ్గారెడ్డి గురించి కిషన్ రెడ్డి.. దత్తత్రేయకి తెలుసు. బీజేపీ గురించి రఘునందన్ కి ఏం తెలుసు.. బీజేపీ లో ఆయన అనుభవం తక్కువ అన్నారు. ఆ రోజుల్లో తల్లిపాత్ర జగ్గారెడ్డిది.. బీజేపీ ది కాదన్నారు. నా కష్టం మీదనే నేను ఎదిగాన‌ని స్ప‌ష్టం చేశారు. నేను రాజకీయం చేస్తున్నప్పుడు రఘునందన్ గల్లీలో గోళీలు ఆడుతున్నాడు అనుకుంటాన‌ని ఎద్దేవా చేశారు. సోనియాగాంధీ ఐటీఐఆర్ ఇచ్చినప్పుడు రఘునందన్ రావుటీఆర్ఎస్‌ ఉన్నాడు.. ఆయనకు అప్పుడు బీజేపీ గురించి ఏం తెలుసు అని ప్ర‌శ్నించారు. మరొక‌సారి నా జోలికి వస్తే బీజేపీలో ఉండే కుళ్లు, కుతంత్రాలు చర్చకు పెడతాన‌న్నారు.

Next Story