సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి మండిపాటు.. 'నువ్వు ఎలాగూ వెళ్లవు.. మేం వెళ్తే నీకొచ్చిన నొప్పేంటి'

TPCC Revanth Reddy Fires On CM KCR.తెలంగాణ సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మండిప‌డ్డారు. తెలంగాణ రాష్ట్రంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 Dec 2021 4:41 AM GMT
సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి మండిపాటు.. నువ్వు ఎలాగూ వెళ్లవు.. మేం వెళ్తే  నీకొచ్చిన నొప్పేంటి

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మండిప‌డ్డారు. తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్చ‌ను కేసీఆర్ హ‌త్య చేస్తున్నాడ‌ని ఆరోపించారు. ప్ర‌తిప‌క్ష నేత‌ల ఇళ్ల‌లోకి ఖాకీల‌ను ఉసిగొల్పుతున్నాడ‌ని.. సన్నిహితులు, మిత్రులు, బంధువుల ఇళ్లలో పరామర్శలకు, శుభకార్యాలకు కూడా వెళ్లనీయని నిర్భందకాండకు త‌మ ఇంటి వద్ద దృశ్యమే ఉదాహరణ అని ఈ రోజు ఉద‌యం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అంటేనే సీఎంకు వ‌ణుకుపుడుతోంద‌న్నారు. తాము ఇంట్లోంచి బ‌య‌ట‌కు కాలు క‌దిపితే ముఖ్య‌మంత్రి వ‌ణికిపోతున్నాడ‌ని చెప్పారు. ప్రజాగ్రహం పెల్లుబికిన నాడు నీ ప్రగతి భవన్‌లు, ఫాంహౌస్‌లు బద్ధలైపోతాయి. జాగ్రత్త కేసీఆర్ అంటూ హెచ్చ‌రించారు.

ఇదేం సంస్కారం కేసీఆర్..?

అర్థరాత్రి నుంచి పోలీసులతో ఇంటిని ముట్టడించడం, అనుమతి లేకుండా ఇంటి లోపలికి జొరబడటం… పరామర్శలకు కూడా వెళ్లకుండా నిర్భందించడం, ఇదేనా కేసీఆర్ నీ పాలనా సంస్కారం అంటూ దుయ్య‌బ‌ట్టారు. తెలంగాణ నీ ప్రైవేటు ఎస్టేట్ అనుకుంటున్నావా? అని ప్ర‌శ్నించారు. రైతులు చస్తుంటే పరామర్శించడం పాపమా..? మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లల్లో శుభకార్యాలు, పరామర్శలకు వెళ్లి గంటల తరబడి కేసీఆర్ గ‌డుపుతున్నార‌న్నారు. ధాన్యం, మిర్చీ రైతుల చావుకేకలు నీ చెవికి చేరడం లేదా!? అని ప్ర‌శ్నించారు. పెద్దోళ్ల ఇళ్లల్లో కార్యాలకు వెళతావు కానీ.. పేదరైతు కుటుంబాన్ని పరామర్శించే తీరకలేదా!? నువ్వు ఎలాగూ వెళ్లవు.. మేం పరామర్శిస్తుంటే నీకొచ్చిన నొప్పేంటి?' అంటూ సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

Next Story
Share it