కర్ణాటక ఫలితాలే తెలంగాణలో పునరావృతం : రేవంత్ రెడ్డి

TPCC President Revanth Reddy said that Karnataka results are going to be repeated in Telangana. కర్ణాటక ఫలితాలే తెలంగాణలో పునరావృతం కాబోతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  13 May 2023 2:45 PM GMT
కర్ణాటక ఫలితాలే తెలంగాణలో పునరావృతం : రేవంత్ రెడ్డి

కర్ణాటక ఫలితాలే తెలంగాణలో పునరావృతం కాబోతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ప్రభావం చూపుతాయని అన్నారు. భారత్ జోడోయాత్రతో కాంగ్రెస్ లో జోష్ వచ్చిందన్నారు. జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ వరుస విజయాలు సాధిస్తోందన్నారు. హిమాచల్ లో తొలి విజయం, కర్ణాటకలో రెండో విజయం, తెలంగాణలో మూడో విజయం సాధించబోతున్నామని, చివరికి ఫైనల్స్ లో 2024లో ఎర్రకోట మీద కాంగ్రెస్ జెండా ఎగురవేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు రేవంత్. బీజేపీని ఓడించడం ద్వారా మోదీని..జేడీఎస్ ను ఓడించడం ద్వారా కేసీఆర్ ను ఓడించామని రేవంత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలవొద్దని ప్రయత్నించిన ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచనలను కర్ణాటక ప్రజలు విస్పష్టంగా తిరస్కరించారు అని రేవంత్ రెడ్డి అన్నారు.

కర్ణాటకలో మత రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టారని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మతం ఒక విశ్వాసమే కానీ.. రాజకీయ అంశం కాదన్నారు. మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్న బీజేపీని ప్రజలు తిప్పి కొట్టి మోడీ నాయకత్వాన్ని ఓడించారని తెలిపారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ గారు నఫ్రత్ చోడో అంటూ ఇచ్చిన సందేశాన్ని విశ్వసించి కర్ణాటక ప్రజలు మోదీని ఓడించారన్నారు రేవంత్.

రాముడిని మోసం చేసిన బీజేపీని భజరంగభళీ ఓడించారని రేవంత్ రెడ్డి అన్నారు. శ్రీరాముణ్ణి అడ్డుపెట్టుకుని పార్టీ విస్తరించాలనుకోవడం బీజేపీ మానుకోవాలి. భజరంగ్ బలిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూశారు. శ్రీరాముణ్ణి అవమానించిన వారిని భజరంగభళీ ఆశీర్వదించడు. ఈ ఓటమి నరేంద్ర మోదీ ఓటమిగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల్లో నెగ్గేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. కర్ణాటక ఫలితాలు మాకు వెయ్యేనుగుల బలానిచ్చాయి. దక్షిణ భారతంలో బీజేపీకి స్థానం లేదు. ఇక్కడి ప్రజలు బీజేపీని తిరస్కరించారు అని రేవంత్ రెడ్డి అన్నారు.

“కర్ణాటకలో కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు ఉత్సాహంగా కలిసిమెలిసి ఎన్నికలను ఎదుర్కొన్నారు. అహంకారం ఒకవైపు, అవినీతి సొమ్ము మరో వైపు పెట్టుబడిగా పెట్టి భయపెట్టడం ద్వారా కాంగ్రెస్ ను ఓడించాలని నరేంద్రమోదీ, బీజేపీ చేసిన కుట్రలను కన్నడ ప్రజలు తిప్పికొట్టారు. తెలంగాణలోనూ సీఎం కేసీఆర్ అహంకారం, అవినీతి సొమ్ముతో ఇతర రాజకీయ పార్టీల మధ్య చిచ్చు పెట్టి ఏదో ఒకరకంగా అధికారాన్ని మూడోసారి నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు" అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

బీజేపీ, బీఆరెస్ మధ్య పెద్ద తేడా లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంట్ లో అన్ని సందర్భాల్లో కేసీఆర్ మోదీకి అండగా ఉన్నారన్నారు. కర్ణాటక ఎన్నికల్లో మోదీని ఓడించాలని కేసీఆర్ ఎప్పుడూ ప్రచారం చేయలేదు. మహారాష్ట్రలో మీటింగ్స్ పెట్టిన కేసీఆర్.. కర్ణాటకలో మీటింగ్ పెట్టి మోదీని ఓడించాలని ఎందుకు చెప్పలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కర్ణాటకలో ఉన్నట్లే.. తెలంగాణలోనూ 40 శాతం సర్కారు ఉంది. మోదీ కి, కేసీఆర్ కు పేరులో తేడా ఉంది తప్ప విధానాల్లో లేదు. దళితబంధులో 30 శాతం తీసుకుంటున్నారని కేసీఆరే వాళ్ల ఎమ్మెల్యేలపై ఆరోపించారు. లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ ను రూ. 7388 కోట్లకే అమ్ముకున్నారు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

జేడీఎస్ ను ఓడించడం ద్వారా కేసీఆర్ ను తిరస్కరించారని రేవంత్ అన్నారు." కుట్రలు, కుతంత్రాలతో జేడీఎస్ ను గెలిపించి, హంగ్ అసెంబ్లీ ఏర్పాటు చేయడం ద్వారా భాజపా మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన రాజకీయ పబ్బం గుడపుకోవాలనుకున్న కేసీఆర్ను కర్ణాటక ప్రజలు తిరస్కరించారు. బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్న కుమారస్వామిని కర్ణాటకకు ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్ ప్రకటించారు. కుమారస్వామి కర్ణాటకకు ముఖ్యమంత్రి కావాలంటే.. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో హంగ్ ఏర్పడాలి. హంగ్ ఏర్పడినప్పుడే జేడీఎస్ పాత్ర అక్కడి రాజకీయాల్లో క్రియాశీలకమవుతుంది. తద్వారా రాజకీయ పబ్బం గడపాలనుకున్న కేసీఆర్ ఎత్తుగడలను కర్ణాటక ప్రజలు చిత్తు చేశారు " అని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణలోనూ స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఎంఐఎం విధానాన్ని ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారని అన్నారు.

కర్ణాటక ఎన్నికల ప్రభావం కచ్చితంగా రాబోయే తెలంగాణ ఎన్నికల మీద ఉంటుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో 41 సీట్లు ఉంటాయి. వీటిల్లో అధిక శాతం స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అక్కడి, ఇక్కడి ప్రజల జీవన విధానం, ఆలోచన సరళి ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి కర్ణాటక ఫలితాలు తెలంగాణ పునరావృతమవుతాయని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు బీఆర్ఎస్ కు ఇష్టం లేదని. అందుకే కర్ణాటక ఫలితాలు తెలంగాణలో పునరావృతం కాబోవని కేటీఆర్ ట్వీట్ చేశారన్నారు. “కాంగ్రెస్ గెలుపును కెటీఆర్ ప్రజా తీర్పుగా అభివర్ణించలేదు. కర్ణాటక తీర్పు తెలంగాణ మీద ఉండదు అంటున్నాడు. అంటే కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు వారికిష్టం లేదు. మోదీ ఓడిపోతే టీఆర్ఎస్ వాళ్లు ఎందుకు అంత బాధపడుతున్నారో అర్ధం కావడం లేదు. తెలంగాణలో రాబోయే ఫలితాలకు కర్ణాటక ఫలితాలు దిక్సూచి. కర్ణాటక ప్రభావం తెలంగాణపై ఖచ్చితంగా ఉంటుంది. కేటీఆర్ ట్వీట్ చివరి దశలో ఉన్న క్యాన్సర్ పేషంట్ కొరికలాంటిది. తెలంగాణలో కర్ణాటక ప్రభావం ఉండకూడదని ఆయన కోరుకుంటున్నారు” అని రేవంత్ రెడ్డి అన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో నిలోఫర్ వద్ద హనుమాన్ దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ సెక్రెటరీలు, ఇతర నేతలతో కలిసి నాంపల్లి దర్గాను దర్శించుకున్నారు రేవంత్ రెడ్డి. తర్వాత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.


Next Story