కేసీఆర్‌.. మోదీతో వైరం ఉందని నమ్మించే ప్రయత్నం చేస్తున్న‌ట్లుంది : రేవంత్

TPCC President Revanth Reddy Fire On CM KCR. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చుకున్నారని.. ఆయన పార్టీకి ఏ పేరైనా మార్చుకోవచ్చని

By Medi Samrat  Published on  18 Jan 2023 1:46 PM GMT
కేసీఆర్‌.. మోదీతో వైరం ఉందని నమ్మించే ప్రయత్నం చేస్తున్న‌ట్లుంది : రేవంత్
కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చుకున్నారని.. ఆయన పార్టీకి ఏ పేరైనా మార్చుకోవచ్చని.. కానీ కేసీఆర్ ఉపన్యాసాలు చూస్తుంటే మోదీతో వైరం ఉందని నమ్మించే ప్రయత్నం చేస్తున్న‌ట్లు కనిపిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కు మోదీని ఓడించాలని ఉంటే గుజరాత్ లో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు.. యూపీలో అఖిలేష్ ను గెలిపించాలని ఎందుకు మద్దతు ఇవ్వలేదని.. ఢిల్లీలో తన వ్యాపార భాగస్వామి కేజ్రీవాల్ పార్టీ గెలుపు కోసం ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్ర‌శ్నించారు.


డి.రాజా, కేరళ సీఎం, ఢిల్లీ సీఎం, పంజాబ్ సీఎం, అఖిలేష్ యాదవ్ బీఆర్ఎస్ సభలో పాల్గొన్నారు. వీళ్లంతా ఒక బృహత్ ప్రణాళిక తో ముందుకు వస్తారని చివరి వరకు గమనించాం.. కానీ కాంగ్రెస్, బీజేపీ లను కలిపి విమర్శించే ప్రయత్నం చేశారని అన్నారు. దేశంలో రైతులకు నీళ్లు ఇవ్వాలని ప్రాజెక్టులు కట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీద‌ని తెలిపారు.

245 టీఎంసీల సామర్ధ్యంతో నాగార్జున సాగర్ ను నిర్మించింది. 1లక్ష 45 వేల గ్రామాలకు కరెంట్, తాగునీరు అందించిన ఘనత కాంగ్రెస్ ది. పేదలకు విద్యను అందించింది కాంగ్రెస్. స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం, బీసీలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీ.విశాఖ ఉక్కు కర్మాగారం ఇచ్చింది కాంగ్రెస్, ఎల్ఐసీ, ఎయిర్ ఇండియా లను ప్రారంభించింది కాంగ్రెస్ అని పేర్కొన్నారు. మోదీ అమ్ముకుంటున్న సంస్థలను స్థాపించింది ఎవరో కేసీఆర్ చెప్పాలని అన్నారు.

ప్రభుత్వ సంస్థలను అమ్ముకుంటున్న మోదీకి పార్లమెంట్ లో మద్దతు ఇచ్చింది.. మీరు కాదా కేసీఆర్? అని ప్ర‌శ్నించారు. కాళేశ్వరం ఖర్చుపై నిజ నిర్ధారణ కమిటీ వేయడానికి సిద్ధమా అని స‌వాల్ విసిరారు. మిషన్ భగీరథతో నీళ్లు ఇస్తున్నామంటున్నారు.. కానీ గజ్వేల్ లో మంచి నీళ్లు అందని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. కాలువల ద్వారా నిజంగా నీళ్లిస్తే.. ఎనిమిదేళ్లలో 25 లక్షల పంపుసెట్లు రైతులు ఎందుకు ఉపయోగిస్తారు. ప్రతీ రైతులకు 24 గంటల కరెంటు అవసరం ఎందుకు ఉంటుందని ప్ర‌శ్నించారు.

మోదీని రక్షించడానికి కేసీఆర్ కాంగ్రెస్ ను దూషిస్తున్నది నిజం కాదా? అని అడిగారు. గ‌తంలో ప్రధానులు 50 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. ఎనిమిదేళ్లలో మోదీ 100 లక్షల కోట్లు అప్పు చేశారని.. అలాంటి మోదీ తో కాంగ్రెస్ ను పోల్చడం కేసీఆర్ దుర్మార్గానికి పరాకాష్ట అని విమ‌ర్శించారు. చైనా మెడలు వంచింది కాంగ్రెస్ అయితే.. 2వేల చదరపు కి.మీ. మన దేశాన్ని అక్రమించుకున్నా చైనాకు మోదీ క్లీన్ చిట్ ఇచ్చార‌ని.. అలాంటి మోదీ ప్రభుత్వంతో కాంగ్రెస్ ను పోలుస్తారా? అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ సీఎం అయ్యాక నిజాం షుగర్ ఫ్యాక్టరీ, సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లులు మూసేశార‌ని.. కంది పప్పుకు మద్దతు ధర గురించి స్పందించని కేసీఆర్.. కంది పంటల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

సెక్రటేరియట్ దగ్గర నిర్మించే అంబేడ్కర్ విగ్రహం చైనా నుంచి తీసుకొచ్చింది నిజం కాదా.. అని ప్ర‌శ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్ 130 సీట్లు గెలుస్తుందని నివేదికలు చెబుతున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక నేతను లొంగ దీసుకోవడానికి 500 కోట్లు ఆఫర్ ఇచ్చింది నిజం కాదా? కర్ణాటకలో 25 నుంచి 30 సీట్లు ఓడించడానికి ఆయనతో బేర సారాలు చేసింది నిజం కాదా? కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే కేసీఆర్ కు నోప్పేంటి? అని ప్ర‌శ్నించారు.

ఇక్కడి ఇంటలిజెన్స్ అధికారులను కర్ణాటక రాష్ట్రంలో నియమించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను ఓడించేందుకు కేసీఆర్ సుపారీ తీసుకున్నారు. ఇంత నీచమైన పనికి పూనుకున్న కేసీఆర్ ఈ సమాజానికి చీడ పురుగో కాదో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని వ్యాఖ్యానించారు. నీ నిజ స్వరూపం తెలిసే కుమారస్వామి నీ సభకు హాజరు కాలేదు. కేసీఆర్ అరాచకాలకు కాలం తప్పక సమాధానం చెబుతుంది. కేసీఆర్ కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. దేశంలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగింది. దీనిపై చర్చకు కేసీఆర్ సిద్ధమా? అని స‌వాల్ విసిరారు. కాంగ్రెస్ ఏం చేసింది.. బీజేపీ ఏం చేసింది.. కేసీఆర్ ఏం చేశారో తేల్చుకుందాం.. ప్రజల ముందు నిలబడదాం.. ఎవరు దోషులో ప్రజలే తేలుస్తారని అన్నారు.

కేసీఆర్ వ్యవహార శైలి అన్ని అనుమానాలకు తావిస్తోంది. రాజకీయస్వార్థంకోసం, ఆర్ధిక లాభాల కోసం దేశాన్ని కూడా తెగనమ్మే నాయకుడు కేసీఆర్ అని విమ‌ర్శించారు. విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగాలు, ప్రాజెక్టులు.. ఏ అంశంపై అయినా చర్చకు సిద్ధం. కాంగ్రెస్ పై కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. కేసీఆర్ వ్యూహాత్మకంగానే డిసెంబర్ లో జరపాల్సిన శీతాకాల సమావేశాలు జరపలేదు. ఫిబ్రవరి చివరిలో ప్రభుత్వాన్ని రద్దు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు.


Next Story