బీజేపీకి రాజీనామా చేసిన వివేక్ వెంకట్ స్వామి కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఆయన చేరికపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శంషాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ను గద్దె దించాలంటే అంతా కలిసికట్టుగా పనిచేయాలని వివేక్ ను కోరడం జరిగిందని తెలిపారు. గాంధీ కుటుంబంతో వివేక్ కు ఎంతో అనుబంధం ఉందన్నారు. వివేక్ తో రాహుల్ గాంధీ ఫోన్ లో మాట్లాడి కాంగ్రెస్ లో చేరాలని కోరారని తెలిపారు. వివేక్ తిరిగి కాంగ్రెస్ లో చేరడమంటే ఆయన సొంత కుటుంబంలో చేరినట్లేనన్నారు.
ఆయన్ను కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. వివేక్ చేరిక కాంగ్రెస్ కు వెయ్యేనుగుల బలాన్ని చేకూర్చిందన్నారు. కీలక సందర్భంలో ఆయన కాంగ్రెస్ లో చేరడంతో తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ కావాలి.. కాంగ్రెస్ రావాలి అనే ప్రజల ఆకాంక్షకు వివేక్ చేరిక బలాన్నిస్తుందన్నారు.