గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నా చౌక్ ఎత్తేసింది.. కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్దించిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఇందిరపార్కులో జరిగిన గ్రామీణ వైద్యుల ఆత్మ గౌరవ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ వైద్యుల ఆత్మ గౌరవ సభ గురించి హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహతో చర్చించినట్లు తెలిపారు. ఆర్ఎంపీ, పీఎంపీలు గ్రామాల్లో డాక్టర్స్ వ్యవస్థకు ఫౌండేషన్ అన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీల సమస్యకు టైం పట్టొచ్చు కానీ పరిష్కారం అవుతుందన్న నమ్మకం ఉందన్నారు.
కాంగ్రెస్ అంటే పేదల ప్రభుత్వం.. అన్ని వర్గాలు సమానం.. భేషజాలు లేవు అన్నారు. మేనిఫెస్టోలో పొందు పరిచిన ప్రతి అంశాన్ని నేరవేర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామాలలో ఆర్ఎంపీ, పీఎంపీ వ్యవస్థ అవసరం ఉంది.. ఆర్ఎంపీ, పీఎంపీలపై దాడుల గురించి ముఖ్యమంత్రితో చర్చిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయారిటీ రైతులతో పాటు విద్య, వైద్యం కూడా అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 30 వేల CMRF చెక్కులు క్లియరెన్స్ అయ్యాయని వెల్లడించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికీ ప్రశ్నించే హక్కు ఉందన్నారు.