కొన్ని సందర్భాల్లో సీఎం రేవంత్ వైయస్సార్‌ను మరిపిస్తారు : టీపీసీసీ చీఫ్
చరిత్ర తిరగరాసిన మహానాయకుడు వైయస్సార్ అని.. ఆనాడు యువతరం వైయస్సార్ బాటలో నడిచిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు.
By Medi Samrat
చరిత్ర తిరగరాసిన మహానాయకుడు వైయస్సార్ అని.. ఆనాడు యువతరం వైయస్సార్ బాటలో నడిచిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. జూబ్లీహిల్స్ హోటల్ దస్పల్ల కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 2004 లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి దోహదపడిన నాయకుడు వైఎస్ఆర్.. రైతే రాజు నినాదంతో అతి తక్కువ కాలంలో అద్భుత పథకాలను అందించిన మహానేత వైఎస్ఆర్ అని అన్నారు. ముఖ్యమంత్రిగా వైయస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు పంచభూతాలు ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. వైయస్సార్ ప్రవేశపెట్టినం ఫీజు రీయింబర్స్మెంట్ పేదింటి బిడ్డల పాలిట వరంగా మారిందన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో పేదింటి బిడ్డలు కార్పొరేట్ కళాశాలలో చదువుకునే అవకాశం లభించిందన్నారు. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108 సేవలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అనేక సంక్షేమ పథకాలు ఆయన విజినరీ నాయకత్వానికి నిదర్శనం అన్నారు. పేదవాడి ఇంట్లో దీపం వెలగాలని, విద్యార్థుల కలలు నిజం కావాలని ఆయన కలగన్నారు.. వైయస్సార్ లాంటి మహా నాయకుడుతో కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. వైఎస్ఆర్ స్ఫూర్తితో వారి స్టైల్లో రాజకీయం చేసే అవకాశం దక్కిందని చెప్పడానికి గర్విస్తున్నానన్నారు. కొన్ని సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి దివంగత రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తిస్తారు.. మరిపిస్తారన్నారు.
నేడు ప్రజాపాలనలో సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా రెండు లక్షల రుణమాఫీ చేశామన్నారు. రైతు భరోసా కింద వేలకోట్లు ఇచ్చి రైతులను ఆదుకున్నాం.. గత పదేళ్లుగా ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తోందన్నారు. మహానేత వైఎస్ఆర్ మన మధ్య లేకపోవడం బాధాకరం.. ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడానికి నిరంతరం కృషి చేస్తామన్నారు.