దమ్ముంటే ఆ విగ్రహాలను టచ్ చెయ్..కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ వార్నింగ్

టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. అధికారం పోయి రోడ్డు మీద పడినా కేటీఆర్‌కు అహంకారం పోలేదు.

By Knakam Karthik
Published on : 12 March 2025 1:37 PM IST

Telangana, Assembly Budget Sessions, Ktr, Tpcc President Mahesh Kumar

దమ్ముంటే ఆ విగ్రహాలను టచ్ చెయ్..కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ వార్నింగ్

గవర్నర్ ప్రసంగాన్ని అవమానపరిచే విధంగా కేటీఆర్ మాట్లాడటం ఆయన అహంకారానికి పరాకాష్ట అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ వాయిదా పడటంతో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంపై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. అధికారం పోయి రోడ్డు మీద పడినా కేటీఆర్‌కు అహంకారం పోలేదు. గవర్నర్‌కు కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలి. గవర్నర్లను అవమానించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. కాంగ్రెస్ తల్లి, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాలను ప్యాక్ చేస్తామంటూ కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారు. దమ్ముంటే విగ్రహాలపై చేయి వేసి చూడు కేటీఆర్, కాంగ్రెస్ కార్యకర్తలు బట్టలూడదీసి కొడతారు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడి కాంగ్రెస్ కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దు.. అని మహేష్‌ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు.

రైతు రుణ మాఫీ లెక్కలు తెలియకుండా కేటీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారు. కేటీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల అమలు తీరు తెలుస్తుంది. కేసీఆర్ కుటుంబం గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం, మేడిగడ్డ నాణ్యత ఏంటో బయటపడినా, మళ్లీ వాటి గురించి మాట్లాడటం కేటీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనం. కేసీఆర్ కుటుంబం అవినీతికి కాళేశ్వరం ఒక ఏటీఎంలా ఉపయోగపడింది. కులగణనలలో తప్పుడు లెక్కలు చెబుతున్నామని అంటున్న మీరు, సమగ్ర కుటుంబ సర్వే వివరాలను పదేళ్లుగా అధికారంలో ఉన్నా ఎందుకు బహిర్గతం చేయలేదు? ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి హాజరై, ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తే బెటర్. అని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.

రైతు ఆత్మహత్యల గురించి కేటీఆర్ మాట్లాడటానికి సిగ్గుండాలి, బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే రైతు ఆత్మహత్యలలో తెలంగాణ రెండో స్థానంలో ఉండేది. బీఆర్ఎస్ పాలనలో రైతన్నలు వరికుప్పల మీద చనిపోయిన ఘటనలు ఇంకా కళ్ల ముందే కదలాడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు దండుకుంది. కులగణన సర్వేలో పాల్గొనకుండా సర్వేను తప్పుబట్టే అర్హత కేటీఆర్‌కు లేదు. చారిత్రాత్మక నిర్ణయాలైన కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసినందుకు అభినందించాల్సి పోయి, విమర్శలు చేయడానికి సిగ్గుండాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు సాగుతుంది. పదేళ్ల పాలనలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిన సన్నాసులు ఎవరో ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. మీరు చేసిన అప్పులకే వడ్డీలు చెల్లించడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురించింది..అని మహేశ్‌ కుమార్ గౌడ్ ఆరోపించారు.

Next Story