కవిత లేఖ 'నవ్వి పొదురు గాక నాకేమి సిగ్గు' అన్నట్టు ఉంది : టీపీసీసీ చీఫ్
ఎమ్మెల్సీ కవిత ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాయడం విడ్డూరం అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
By Medi Samrat
ఎమ్మెల్సీ కవిత ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాయడం విడ్డూరం అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కవిత జాగృతి తరపున రాశారా.? బీఆర్ఎస్ తరఫున రాశారా క్లారిటీ లేదన్నారు. మల్లికార్జున్ ఖర్గేకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాయడం వింతగా, విచిత్రంగా ఉందన్నారు. కవిత లెటర్ రాయడం నవ్వి పొదురు గాక నాకేమి సిగ్గు అన్నట్టు ఉందన్నారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం వెలగబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు తగ్గించింది కేసీఆర్ కదా...? పదేళ్లలో బీసీల గురించి కవిత మాట్లాడినట్లు ఒక్క క్లిపింగ్ చూపించగలరా...? రాజకీయ శూన్యంలో కవిత మనుగడ కోసం బీసీల జపం చేస్తున్నారని అన్నారు.
బీసీల గురించి మాట్లాడటానికి కవితకు అర్హత లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కాంగ్రెస్ పార్టీ అండ అన్నారు. స్థానిక సంస్థలతో పాటు విద్య, వైద్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ సొంతం అన్నారు. బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ సమయంలో కవిత లిక్కర్ స్కాంలో జైళ్లో ఊచలు లెక్కపెడుతున్నారని అన్నారు.
నిరుద్యోగుల ఉసురు తగిలి బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందన్నారు. పదేళ్ల లో సాటి మహిళల గురుంచి కవిత ఏనాడైనా మాట్లాడారా.? బనకచర్లపై రేవంత్ చేసిన సవాల్ కి హరీష్ రావు సిద్ధమా.? ఆ నాడు ఏపీ ప్రభుత్వ నేతలతో చెట్టా పట్టాలు వేసుకొని తిరిగింది మీరు కాదా.? రోజా ఇంట్లో చేపల పులుసు తిని నీటి వాటా విషయంలో కాంప్రమైజ్ అయింది మీరు కాదా.? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బనకచర్ల విషయంలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ నాయకుడి నియమించలేని స్థితిలో బీజేపీ ఉండటం విచారకరం అన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అన్నారు. లాల్ బహదూర్ స్టేడియంలో తలపెట్టిన సామాజిక న్యాయ సమర భేరి సభను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.
రైతు భరోసా పేరిట 9 రోజుల్లో 9 వెలు కోట్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది.. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ఆస్తి పంపకాల వాట తెగిందా అని కవితని సూటిగా అడుగుతున్నా.. ఏ రోకో చేసినా సరే.. పదేళ్లు ఏం చేశారో చెప్పి రైల్ రోకో చేయండన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్టేట్‌మెంట్ విషయంలో క్రమ శిక్షణ కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు. కిషన్ రెడ్డి - కేసిఆర్‌లది పెవికాల్ బంధం అన్నారు. మతతత్వ పార్టీతో లౌకిక వాద పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు.