ఫార్ములా-ఈ కేసు సక్రమమే.. నిధులు గోల్‌మాల్‌ చేసి సుద్ధపూసలా మాట్లాడుతున్నారు

కేటీఆర్‌పై ఫార్ములా-ఈ కేసు సక్రమమే అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

By Medi Samrat  Published on  20 Dec 2024 10:48 AM GMT
ఫార్ములా-ఈ కేసు సక్రమమే.. నిధులు గోల్‌మాల్‌ చేసి సుద్ధపూసలా మాట్లాడుతున్నారు

కేటీఆర్‌పై ఫార్ములా-ఈ కేసు సక్రమమే అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఫార్ములా ఈ కారు రేసులో అక్రమాలు జరిగిన మాట వాస్తవం అన్నారు. మండలి మీడియా పాయింట్ వద్ద ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. అక్రమాలు జరిగినట్టు పలు ఆధారాలున్నా.. కడిగిన ముత్యమంటూ కేటీఆర్‌ తనకు తానే సర్టిఫికేట్‌ ఇచ్చుకోవడం హాస్యాస్పదం అన్నారు. ప్రభుత్వం పంపిన ఆధారాలపై గవర్నర్‌ న్యాయసలహా తీసుకొని కేసుకు అనుమతించాక ఇది అక్రమ కేసు ఎలా అవుతుంది..? అని ప్ర‌శ్నించారు. చట్టపరంగా కేసు నమోదు అయినందున దీనిపై అసెంబ్లీలో కాదు.. కోర్టులో తేల్చుకోవాలన్నారు. హెచ్‌ఎమ్‌డీఏ భాగస్వామ్యం కాకున్నా.. దాని ఖాతా నుండి ఆర్థికపరమైన అనుమతులు లేకుండానే రూ.54.88 కోట్లు చెల్లించేలా కేటీఆర్‌ ఒత్తిడి తెచ్చారు. ఆధారాలు కనిపిస్తున్నా.. అక్రమాలకు పాల్పడలేదని కేటీఆర్‌ బుకాయిస్తున్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వలే.. కాంగ్రెస్ అక్రమంగా కేసులు బనాయించట్లేదన్నారు. రేసింగ్ స్కాంలో నిబంధనల ప్రకారం గవర్నర్‌ అనుమతి తీసుకునే అధికారులు ముందుకెళ్తున్నారన్నారు.

ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగానే నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీలకు ఫండ్స్‌ మంజూరు ఎలా చేస్తారు?హద్దుల్లేని కేటీఆర్‌ అక్రమాలతో అధికారులు బలిపశువులుగా మారారన్నారు. నిబంధనలు పాటించకుండా పెద్ద మొత్తంలో విదేశాల నిధులు బదిలీ చేయడంతో హెచ్‌ఎండీఏ ఆదాయ పన్ను శాఖకు రూ.8 కోట్లకు పైగా పన్ను చెల్లించాల్సి వచ్చింది. నిబంధనలను కాదని మూడేళ్లలో రూ.600 కోట్లు చెల్లించేలా ఒప్పందం కేటీఆర్‌ అనుమతితోనే జరిగింది. నిబంధనలకు విరుద్దంగా హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ఫార్ములా ఈ` కారు రేసు కోసం 2.8 కి.మీల ప్రత్యేక ట్రాక్‌ను ఏర్పాటు చేశారు.. నిబంధనలను అతిక్రమించి ప్రజలను ఇబ్బంది పెట్టడం హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజిని పెంచడమా..? అని ప్ర‌శ్నించారు. బీఆర్ఎస్ నేతల దోపిడీతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్న‌ది.. బిఆర్ఎస్ నేతలు ఏం చేసినా వారి స్వలాభం కోసమే? తెలంగాణ, హైదరాబాద్‌ కోసం కాదని ఈ అక్రమాలే నిరూపిస్తున్నాయన్నారు.

ఫార్ములా ఈ` కారు రేసు పేరుతో నిధులు గోల్‌మాల్‌ చేసి ఇప్పుడు సుద్ధపూసలాగా మాట్లాడుతున్నారు.. ప్రజలు ఛీకొట్టి గద్దె దింపినా ఇంకా అధికారంలోనే ఉన్నామనే భ్రమలతో కేటీఆర్ బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారు.. కేసులో అధికారులకు సహకరించాల్సిన కేటీఆర్‌ అహంకారంతో విర్రవీగుతూ, ఉద్యమకారులం.. భయపడం.. అంటూ కేసుకు సంబంధంలేని మాటలు మాట్లాడుతున్నారన్నారు.

Next Story