బీజేపీ నేతలు చేతగాని దద్దమ్మలు.. ఢిల్లీలో టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలును డిమాండ్ చేస్తూ జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు
By Medi Samrat
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలును డిమాండ్ చేస్తూ జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన రిజర్వేషన్ల అంశాన్ని మతకార్డుతో ముడిపెట్టి అడ్డుకోవడమే వారి లక్ష్యమన్నారు. “బిడ్డ కిషన్ రెడ్డి ఎస్సీలు, ఎస్టీలు, బీసీల మద్దతు లేకుండా సికింద్రాబాద్‌లో నామినేషన్ వేయగలరా?” అని ఆయన ప్రశ్నించారు. బీసీల పేరిట గెలిచిన బండి సంజయ్, ఇప్పుడు కిషన్ రెడ్డికి వత్తాసు పలుకుతున్నారన్న ఆయన.. ఇది సిగ్గుచేటన్నారు. మతాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో గెలవడం బీజేపీ నేతలకు అలవాటైందని విమర్శించారు.
బీజేపీ నేతలను “చేతగాని దద్దమ్మలు”గా వ్యవహరించిన మహేష్ గౌడ్, “సాయంత్రం అయితే ముస్లింల జపం చేస్తారు” అంటూ ఆ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎత్తిచూపారు. గుజరాత్‌లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నామని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల వీడియోను కిషన్ రెడ్డి చూడాలని, ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలకు ఉన్న రిజర్వేషన్లపై అధ్యయనం చేయాలని సూచించారు. తెలంగాణ అసెంబ్లీలో బీసీ బిల్లుకు ఓటు వేసిన బీజేపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించిన టీపీసీసీ చీఫ్, బీసీలకు మద్దతుగా అన్ని వర్గాల నేతలు నిలిచారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్‌తోపాటు కాంగ్రెస్ శ్రేణులంతా ప్రధానికి కనువిప్పు కలిగించేందుకు మహాధర్నాలో పాల్గొన్నారని తెలిపారు.
“బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఎంత దూరమైనా పోతామని” మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల కంటే బీసీ రిజర్వేషన్లే ముఖ్యమన్నారు. “ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి మొనగాడు. రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకోవాలంటే దమ్ము, ధైర్యం అవసరం” అని ప్రశంసించారు. సీఎం రేవంత్ నిర్ణయం పట్ల ప్రధాని మోదీ పరేషాన్లో పడ్డారని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు 42 శాతం బీసీ రిజర్వేషన్లను సపోర్ట్ చేయలేక, వ్యతిరేకించలేక లొసుగులు వెతుకుతున్నారని, ముస్లిం కార్డు పేరిట అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు. “తెలంగాణ బీసీలు రాహుల్ గాంధీకి రుణపడి ఉండాలి” అని పేర్కొంటూ, ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి కులసర్వేకు శ్రీకారం చుట్టారని తెలిపారు.
శాస్త్రీయంగా నిర్వహించిన కుల సర్వే ద్వారా తెలంగాణలో బీసీ జనాభా 57 శాతంగా తేలిందని, ఆ డేటాను అధికారికంగా ప్రకటించడం సాహసోపేతమన్నారు. ఈ కులసర్వే దేశానికి దిక్సూచి, తెలంగాణ రోల్ మోడల్‌గా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్‌కు కట్టుబడి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించామని గుర్తు చేసిన టిపిసిసి చీఫ్, రాహుల్ గాంధీ ఎక్కడ ప్రసంగించినా తెలంగాణ కుల సర్వే అంశాన్ని ప్రస్తావించకుండా ఉండటం లేదని తెలిపారు. “బీసీల వేదన కేంద్రానికి తెలియజేయడం కోసం వన్ వాయిస్... వన్ విజన్... యునైటెడ్ బీసీ నినాదంతో ఈ మహా ధర్నా నిర్వహించామని” పేర్కొన్నారు. చివరగా, 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలిస్తే కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందనే భావనతోనే బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.