తెలుగు కోడలు అయి ఉండి కూడా తెలంగాణపై ప్రేమ చూపలేదు : టీపీసీసీ చీఫ్
బడ్జెట్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.
By Medi Samrat Published on 1 Feb 2025 2:30 PM ISTబడ్జెట్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగు మహిళ అయిన నిర్మలా సీతారామన్ కేంద్రంలో వరసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు ఆమెకు టీపీసీసీ తరపున శుభాకాంక్షలు.. తెలుగు కోడలు అయి ఉండి కూడా నిర్మలమ్మ తెలంగాణపై ప్రేమ చూపలేదన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణకు కేంద్రం గాడిద గుడ్డు బడ్జెట్ ఇచ్చిందని విమర్శించారు. బీహార్ ఎన్నికల బడ్జెట్‌లాగా ఉంది. ఎన్నికల కోసమే బీహార్ కు నజరాణాలు ఇచ్చారన్నారు. బీజేపీ తెలంగాణపై వివక్ష చూపిస్తుంది.. రాజకీయంగా తెలంగాణను దెబ్బతీయాలని చూస్తుందన్నారు.
50.65 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం.. తెలంగాణకు ఒక్క పైసా ప్రత్యేక కేటాయింపు జరపలేదన్నారు. త్వరలో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో అక్కడ రాజకీయ లబ్ది కోసమే బీజేపీ కేంద్ర బడ్జెట్ ను ఉపయోగించుకుంటుందన్నారు. దేశం మొత్తం ప్రజల నుంచి వసూలు చేసే బడ్జెట్ లో అందరికి సమానంగా ఇవ్వాలన్నారు. నిర్మలమ్మ తన బడ్జెట్ ప్రసంగంలో గురజాడ అప్పారావు గారి దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న పదాలను వాడారు.. మరి తెలంగాణ ప్రజలు దేశంలో మనుషులు కారా.? అని ప్రశ్నించారు.
తెలంగాణకు ఎన్నికల సమయంలో ప్రధాని మంత్రి, బీజేపీ నాయకులు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు కేంద్ర మంత్రులను, ప్రధాన మంత్రిని కలిసి తెలంగాణ కు రావాల్సిన అనేక అంశాలపై విజ్ఞప్తి చేశారన్నారు. రైల్వే ప్రాజెక్టులు, విభజన హామీలు, పాలమూరు రంగారెడ్డి నీటి పారుదల ప్రాజెక్టు జాతీయ హోదా, ఐ.టి.ఐ.ఆర్, బయ్యారం కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం లాంటి అనేక ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయన్నారు.
రాష్ట్రం నుంచి 40 వేల కోట్ల జిఎస్టీ రూపాయలు కేంద్రానికి వెళ్తున్నాయి.. మరి ఆ మేరకు అయినా తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు రావాలి కదా..? కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నదని బీజేపీ వివక్ష చూపడం అన్యాయం.. ఇప్పటికైనా కేంద్రం తెలంగాణకు అవసరమైన అంశాలలో సహకారాన్ని అందించాలన్నారు.