పెళ్లి కూడా చేసుకోకుండా కాంగ్రెస్ కోసం పని చేస్తున్నారు ఆమె
గాంధీభవన్‌లో ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల మాజీ ఇంచార్జీ దీపా దాస్ మున్షీకి ధన్యవాదాలు తెలియజేస్తూ విస్తృత స్థాయి సమావేశం తీర్మానం చేసింది
By Medi Samrat Published on 28 Feb 2025 3:18 PM IST
గాంధీభవన్‌లో ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల మాజీ ఇంచార్జీ దీపా దాస్ మున్షీకి ధన్యవాదాలు తెలియజేస్తూ విస్తృత స్థాయి సమావేశం తీర్మానం చేసింది. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతం, ఏఐసీసీ ఇచ్చిన కార్యక్రమాల నిర్వహణ మీద చర్చ జరిగినట్లు వెల్లడించారు. కుల గణన, ఎస్సీ వర్గీకరణ మీద చర్చ చేసి.. భవిష్యత్ కార్యాచరణ మీద నిర్ణయం తీసుకుంటామన్నారు.
కార్యకర్తల పోరాట ఫలితమే అధికారం లోకి వచ్చాం.. కాంగ్రెస్ అధిష్ఠానం ఇచ్చిన మాటను నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారన్నారు. కేసీఆర్ పదేళ్లలో ఇవ్వలేని ఉద్యోగాలు.. మనం ఏడాదిలో 56 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. బీఆర్ఎస్ పదేళ్ళలో ఇచ్చిన దానికంటే అధికంగా మనం ఏడాదిలో ఇచ్చాము.. నెలకు 5 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. రైతు రుణమాఫీ పదేళ్ళలో బీఆర్ఎస్ ఇచ్చిన మొత్తం నిధుల కంటే ఎక్కువ రుణ మాఫీ కాంగ్రెస్ పాలనలో ఏడాదిలో ఇచ్చామని తెలిపారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం.. కుల సర్వే చేసి.. నివేదిక అసెంబ్లీ లో టేబుల్ చేశాం.. దేశానికి కుల గణన దశ దిశగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న సంక్షేమం, అభివృద్ది, ఏఐసీసీ ఇచ్చిన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని శ్రేణులకు సూచించారు. పెళ్లి కూడా చేసుకోకుండా కాంగ్రెస్‌కు మనస్ఫూర్తిగా పని చేసే మహా నాయకురాలు మీనాక్షి నటరాజన్ అని.. గతంలో మనకు ఎన్ని పాత అలవాట్లు ఉన్న విడిచి.. కొత్త అలవాట్లు చేసుకొని మీనాక్షి నటరాజన్ మాదిరి సింప్లి సిటీ గా ఉండాలి.. పార్టీ కోసం మనం నిరంతరం శ్రమించాలని ఆమెను ఉదహరించారు.