సంక్రాంతి తర్వాత పార్టీ నేతలకు తీపి కబురు : టీపీసీసీ చీఫ్‌

పదేళ్ల కార్యకర్తల కృషి వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

By Medi Samrat  Published on  6 Jan 2025 6:20 PM IST
సంక్రాంతి తర్వాత పార్టీ నేతలకు తీపి కబురు : టీపీసీసీ చీఫ్‌

పదేళ్ల కార్యకర్తల కృషి వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. పార్టీ కుటుంబం లాంటింది.. మనస్పర్థలు సహజం.. సమస్యలు ఉంటే చర్చించుకొని ముందుకెళ్లాలని సూచించారు. సంక్రాంతి తర్వాత పార్టీ నేతలకు తీపి కబురు చెబుతామ‌న్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100కి 100 శాతం సీట్లు గెలుచుకునేందుకు కృషి చేయాలన్నారు. పోటీ చేసే అభ్యర్థులు పార్టీలో అందరినీ కలుపుకొని పోవాలి.. ఇప్పటినుంచే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం అవ్వండని సూచించారు.

అధికారం కొల్పోయాక బీఆర్ఎస్ నేతల మానసిక స్థితి బాగోలేదన్నారు. ఏ మొఖం పెట్టుకొని ఎమ్మెల్సీ కవిత జిల్లాకు వచ్చింది.. పదేళ్లు అధికారంలో ఉన్నపుడు కవితకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల గోడు పట్టలేదా అని ప్ర‌శ్నించారు. 16 మంది ముఖ్యమంత్రులు పాలించి చేసిన అప్పు కంటే.. కేసీఆర్ ఒక్కడే చేసిన అప్పు అంతకంటే రెట్టింపు ఉంద‌ని.. పదేళ్ల పాలనలో 7 లక్షల కోట్లు అప్పు చేసి కేసీఆర్ ఏం ఉద్దరించారో సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి విధ్వంసం సృష్టించారు.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకి ఏడాది కాంగ్రెస్ పాలనికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంద‌న్నారు. విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.. ఇక్కడి బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు మతం పేరిట రాజకీయం చేసి గెలిచారు.. మతం పేరిట ఓట్లు అడగడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. 90 శాతం కుల గణన సర్వే పూర్తయిందని.. గాంధీ భవన్ తలుపు ఎవరు తట్టినా పీసీసీ అధ్యక్షుడిగా అందుబాటులో ఉంటాన‌న్నారు.

Next Story