పోటీకి సిద్ధంగా ఉంటే ఆయనకే మరోసారి టికెట్ : టీపీసీసీ చీఫ్
గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది.
By Medi Samrat Published on 28 Nov 2024 9:00 PM ISTగాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏఐసీసీ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ ముంన్షి హాజరయ్యారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, కొండ సురేఖ, ఎమ్మెల్యే లు డీసీసీ అధ్యక్షులు. ఎమ్మెల్సీలు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ జరగగా.. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నాయకులు పాల్గొన్నారు. గంటన్నర పాటు సుదీర్ఘంగా సమావేశం జరిగింది. నేతలు లోతుగా అంశాలవారిగా చర్చించారు.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాబోయే గ్రాడ్యుయేట్ కౌన్సిల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. అభ్యర్థి కోసం అన్ని కోణాల్లో పరిశీలన జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. మన సిట్టింగ్ కాబట్టి.. ప్రభుత్వంలో ఉన్నాం.. మన సీటు మనం కాపాడుకోవడం చాలా కీలకం అన్నారు. యువత, నిరుద్యోగులు, ఉద్యోగులకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు వివరించాలన్నారు. మొత్తంగా ఎన్నికల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాల వారీగా, అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ఇంచార్జ్ లను నియమించాలన్నారు.
ఎమ్మెల్సీ పరిధిలో 42 అసెంబ్లీ నియోజక వర్గాలలో మన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వారి వారి నియోజక వర్గాలలో గట్టిగా పని చేయాలని ఆదేశించారు. నియోజక వర్గ ఇంచార్జ్ లు కూడా వారి వారి నియోజక వర్గాలలో ఓటర్లతో సమావేశాలు నిర్వహించాలి. జీవన్ రెడ్డి తాను పోటీకి సిద్ధంగా ఉంటే ఆయనకే మరోసారి అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేయాలని.. లేని పక్షంలో కులం, జిల్లాలు, అన్ని పరిగణలోకి తీస్కొని అన్ని అంశాలను ఆలోచించి అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని సూచించారు. కౌన్సిల్ నియోజక వర్గం పరిధిలోని మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో మంత్రులుగా ఉన్న శ్రీధర్ బాబు, దామోదర్ రాజా నర్సింహ, పొన్నం ప్రభాకర్ లు పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రణాళిక సిద్ధం చేస్తారన్నారు.
నియోజక వర్గాలలో ఓటర్లను నమోదు చేయించడం, ఓటర్లతో సమావేశాలు నిర్వహించి వారిని మన వైపు మద్దతు ఇచ్చేలా చూసుకోవాలన్నారు. పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రణాళిక తయారు చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి విజయం సాధించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.