సురవరం సుధాకర్ రెడ్డి లెజెండరీ పర్సనాలిటీ గల వ్యక్తి అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. రవీంద్ర భారతిలో జరిగిన సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో ఆయన పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముగ్దూం భవన్ రీ ఓపెనింగ్ రోజున సురవరం గారితో వేదిక పంచుకోవడం తనకు గర్వకారణమని, ఆ సందర్భంలో దేశంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో బలపడాల్సిన అవసరాన్ని వివరించిన విషయాన్ని గుర్తు చేశారన్నారు.
ఆపరేషన్ కగార్ పై తాను చేసిన ప్రసంగాన్ని సురవరం గారు ప్రత్యేకంగా గుర్తు చేస్తూ అభినందించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. లౌకికవాద శక్తులు బలపడినప్పుడే దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. కులాలు, మతాలు, ప్రాంతీయత పేరిట దేశాన్ని బలహీనపరచే కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నక్సల్స్ బాధితుడిగా ఉన్నప్పటికీ, కగార్ పేరిట జరుగుతున్న హింసను తాను ఎప్పుడూ వ్యతిరేకించానని తెలిపారు. శత్రుదేశం పాకిస్థాన్‌తో యుద్ధాన్ని ఆపేసిన బీజేపీ ప్రభుత్వం.. కగార్ విషయంలో మాత్రం మొండి వైఖరితో ముందుకు వెళ్లిందని విమర్శించారు. దేశం ఐక్యంగా ఉండాలని ఆకాంక్షించే వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి అని కొనియాడారు. ఆయన జీవితం, జీవన విధానం ఎల్లప్పుడూ మార్గదర్శకమని మహేష్ గౌడ్ పేర్కొన్నారు..