కేసీఆర్‌ దోపిడీకి 4 కోట్ల మంది ప్రజలు బలయ్యారు: రేవంత్‌రెడ్డి

తెలంగాణలో సీఎం కేసీఆర్‌ దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయిందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

By Srikanth Gundamalla  Published on  16 Jun 2023 4:07 PM IST
Revanth Reddy, Congress, Telangana, Politics, CM KCR, KTR

కేసీఆర్‌ దోపిడీకి 4 కోట్ల మంది ప్రజలు బలయ్యారు: రేవంత్‌రెడ్డి

తెలంగాణలో సీఎం కేసీఆర్‌ దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయిందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలో కేసీఆర్‌కు ఇక నూకలు చెల్లాయన్నారు.

రేవంత్‌రెడ్డి సమక్షంలో అచ్చంపేట నియోజవకర్గానికి చెందిన బీఆర్ఎస్‌ సీనియర్ నేత గంగాపురం రాజేందర్‌తో పాటు భీముడు నాయక్, అచ్చంపేట, చారగొండ మండలాలకు చెందిన పలువరు బీఆర్ఎస్‌ కార్యకర్తలు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. కేసీఆర్ పదేళ్లలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులపాలు చేసి.. బొందలగడ్డలా మార్చారని అన్నారు రేవంత్‌రెడ్డి. ఇక కేసీఆర్‌ అరాచక పాలనను భరించే ఓపిక ప్రజలకు లేదన్నారు. కేసీఆర్‌ నుంచి తెలంగాణకు విముక్తి కలిగించేందుకే కాంగ్రెస్‌లో నాయకులు చేరుతున్నారని చెప్పారు. ఈ చేరికలు గాలివాటం చేరికలు కాదని చెప్పారు రేవంత్‌రెడ్డి. హరీశ్‌రావు, కేసీఆర్‌ పుట్టకపోయి ఉంటే తెలంగాణ వచ్చేది కాదని కేటీఆర్ అన్నారు. వాళ్లు పుట్టకముందే తెలంగాణ ఉద్యమం మొదలైందని కేటీఆర్‌కు కౌంటర్‌ ఇచ్చారు రేవంత్‌రెడ్డి. ఎన్నికలు, కలెక్షన్ల కోసమే 2001లో కేసీఆర్ పార్టీని స్థాపించారని ఆరోపించారు. కేసీఆర్‌ పార్టీలో చాలా మంది సీనియర్‌ నాయకులకు అన్యాయం జరిగిందన్నారు. 22 ఏళ్లు జెండా మోసిన గంగాపురం రాజేందుకు న్యాయం జరిగిందా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

తెలంగాణలో మంచి రోజులు రావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఆయన గుర్తు చేశారు. నల్లమల అడవుల్లో అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని రేవంత్‌ ఆకాంక్షించారు.

Next Story