బీజేపీ, బీఆర్ఎస్‌ నేతలకు టీపీసీసీ చీఫ్ స‌వాల్‌

తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలకు నేడు చారిత్రాత్మక దినమ‌ని టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

By Medi Samrat  Published on  17 March 2025 2:25 PM IST
బీజేపీ, బీఆర్ఎస్‌ నేతలకు టీపీసీసీ చీఫ్ స‌వాల్‌

తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలకు నేడు చారిత్రాత్మక దినమ‌ని టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శాసన మండలిలో ఆయ‌న మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిల్లును చట్టసభల్లో ఆమోదంతో బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని నిరూపితమైందన్నారు. దేశ వ్యాప్తంగా కుల గణన సర్వే కోసం కేంద్రాన్ని అడగడానికి మాతో కలిసి బీజేపీ, బీఆర్ఎస్ నేతలు వస్తారా.? సవాల్ విసిరారు. చారిత్రాత్మక బీసీ బిల్లును ప్రవేశపెడుతున్న కాంగ్రెస్‌తో బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు కలిసిరాకపోతే బీసీ సామాజికవర్గం ఆ పార్టీలను ఎన్నటికీ క్షమించదన్నారు.

బీజేపీ వారికి నిజంగా బీసీలకు న్యాయం చేయాలని ఉంటే దీన్ని కేంద్రంలో కూడా ఆమోదించేలా బీజేపీ అధిష్టానాన్ని ఒప్పించాలన్నారు. విద్య, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిల్లును చట్టసభల్లో ఆమోదంతో కాంగ్రెస్‌ పార్టీయే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తుందని మరోసారి రుజువయ్యిందన్నారు.

సామాజిక న్యాయానికి కాంగ్రెస్‌ పార్టీ పెద్దపీట వేస్తుందని చెప్పడానికి బీసీ రిజర్వేషన్ల, ఎస్సీ వర్గీకరణ బిల్లులను చట్టసభల్లో ప్రవేశపెట్టడమే నిదర్శనం.. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం రాష్ట్రంలో కులగణన పూర్తి చేసి కాంగ్రెస్‌ చరిత్ర సృష్టించడమే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. బీజేపీ నేతలకు చిత్త శుద్ధి ఉంటే 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు తెలపాల‌ని సూచించారు.

రాష్ట్రంలో కులగణన పూర్తి చేసిన కాంగ్రెస్‌ బీసీలకు న్యాయం చేసే దిశగా వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్య, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిల్లును చట్టసభల్లో ఆమోదం తర్వాత కేంద్రానికి పంపిస్తుంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 23 శాతానికి తగ్గించి చారిత్రాత్మక తప్పు చేసిన బీఆర్‌ఎస్‌.. ఇప్పుడు పశ్చాతాపం వ్యక్తం చేసి.. బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని చెప్పిన కేసీఆర్‌, గెలిచాక తానే గద్దెనెక్కి దళితులను అవమానించారన్నారు.

Next Story