నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్ష పూరితంగా ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్‌షీటలో చేర్చడానికి నిరసిస్తూ రేపు టీపీసీసీ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఈడీ కార్యాలయం ముందు ధర్నా చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రాల్లోనూ రేపు డీసీసీ ఆధ్వర్యంలో ధర్నాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని టీపీసీసీ చీఫ్ పిలుపునిచ్చారు.
అయితే నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ వ్యవహారంలో ఈడీ తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ మేరకు అందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురి పేర్లను పేర్కొంది. ఇప్పటికే కేసుతో లింక్ అయి ఉన్న ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు.. తాజాగా, కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మరో ఇద్దరిపై దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లయింట్ దాఖలు చేశారు. ఆ ఫిర్యాదుపై ఢిల్లీ స్పెషల్ కోర్టు ఈనెల 25న విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరిని నిరసిస్తూ.. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణులకు కీలక పిలుపునిచ్చారు.