ములుగు ఫారెస్ట్‌లో చిక్కుకున్న పర్యాటకులు సేఫ్‌

భారీ ఎత్తున కురుస్తున్న వర్షాలతో పరవళ్లు తొక్కుతున్న జలపాతాన్ని 60మంది పర్యాటకులు చూసేందుకు వెళ్లి అడవిలో చిక్కుకుపోయారు.

By అంజి  Published on  27 July 2023 7:05 AM IST
Tourists, Mutyandhara Falls, Mulugu, Telangana

ములుగు ఫారెస్ట్‌లో చిక్కుకున్న పర్యాటకులు సేఫ్‌

భారీ ఎత్తున కురుస్తున్న వర్షాలతో పరవళ్లు తొక్కుతున్న జలపాతాన్ని 60మంది పర్యాటకులు చూసేందుకు వెళ్లి అడవిలో చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ములుగు జిల్లాలోని వీరభద్రవరం అడవుల్లో ముత్యం ధార జలపాతం ఉంది. వెంకటాపురం మండల కేంద్రానికి 9 కి.మీ. దూరంలో దట్టమైన అడవిలో ఈ జలపాతాలు ఉన్నాయి. బుధవారం ఉదయం చుట్టూ అందమైన ప్రకృతి మధ్యలో ఉన్న ఈ జలపాతాన్ని చూడటానికి సుమారు 84 మంది పర్యాటకులు వెళ్లారు. కొంత మంది కార్లలో వెళ్లగా.. కొంత మంది యువతీ యువకులు బైకులపై వెళ్లారు. మిగిత వారందరూ వెళ్ళిపోగా, వీరభద్రవరం అడవుల్లో 42 మంది పర్యాటకులు చిక్కుకున్నారు.

8 గంటల పాటు కారడివిలో, కుండపోత వర్షంలో ఆహాకారాలు చేశారు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపిన పర్యాటకులు చివరకు ఎన్ డీ ఆ ఎఫ్ బృందాలు, పోలీసులు సాహసంతో సురక్షితంగా బయటపడ్డారు. పర్యాటకులు అడవిలో చిక్కుకుపోయిన విషయం రాత్రి సమయంలో వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రి సత్యవతి ఆదేశాలతో ఎన్డీఆర్‌ఎఫ్‌, డీడీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. బాధితులు సురక్షితంగా ఉన్నారని, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే ముత్యంధార జలపాతం సందర్శనను అటవీశాఖ నిలిపివేసింది. అయినా కొందరు బుధవారం నాడు జలపాతం దగ్గరకు వెళ్లారు.

తిరుగు ప్రయాణంలో మామిడివాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో ప్రయాణికులు ఆవలివైపు చిక్కుకుపోయారు. ఈ క్రమంలోనే పర్యాటకుల్లో ఒకరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సత్యవతి.. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ములుగు జిల్లా ఎస్పీ గాష్‌ ఆలం.. పర్యాటకులతో మాట్లాడి జాగ్రత్తగా ఉండాలని, రెస్క్యూ బృందాలు వస్తున్నాయని తెలిపారు. అర్ధరాత్రి ప్రతికూల పరిస్థితుల మధ్య పర్యాటకుల దగ్గరకి వెళ్లిన ఎన్డీఆర్‌ఎఫ్‌,డీడీఆర్‌ఎఫ్‌ వారికి భోజనం తీసుకెళ్లాయి. అనంతరం 2.20 గంటల సమయంలో పర్యాటకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

Next Story