యాదాద్రి జిల్లాలోని తుర్కపల్లి మండలంలో ఉన్న దత్తాయిపల్లి కంచలో గత 12 రోజులుగా పెద్దపులి సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. పెద్దపులి దాడిలో పశువులు మృతి చెందడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుర్కపల్లి మండలం గొట్టే శ్రీశైలం గ్రామంలోని రైతుకు చెందిన లేగ దూడపై పెద్దపులి దాడి చేసింది. అదేవిధంగా మరో రైతుకు చెందిన ఒక ఆవును కూడా పెద్దపులి చంపినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. అంతేకాకుండా మరో ఆవు కూడా కనిపించకుండా పోవడంతో వాటిని కూడా పెద్దపులి చంపి ఉంటుందని గ్రామస్తులందరూ అనుమానిస్తున్నారు.
పెద్దపులి దాడి చేసిన ప్రాంతంలో రక్తపు మరకలు, పాదముద్రలు కనిపించడంతో భయభ్రాంతులకు గురైన గ్రామస్తులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పెద్దపులి ఆనవాళ్లు సేకరించి వాటిని ఉన్నతాధికారులకు పంపించారు. గ్రామ పరిసరాల్లో అడవులకు సమీపంగా ఉండే వ్యవసాయ భూములు, పశువులు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో పెద్దపులి సంచారం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లకూడదని.. రాత్రి సమయాల్లో పశువులను వదిలిపెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. పెద్దపులి కదలికలపై నిరంతరం నిఘా పెట్టామని.. వెంటనే పట్టుకుంటామని అధికారులు భరోసా ఇచ్చారు. అప్పటివరకు గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు.