రాఖీ పౌర్ణమికి 3 వేల ప్రత్యేక బస్సులు
రాఖీ పౌర్ణమికి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను
By Medi Samrat Published on 26 Aug 2023 7:54 PM ISTరాఖీ పౌర్ణమికి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్ ఆదేశించారు. రక్షాబంధన్‌కు రాష్ట్రవాప్తంగా 3 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులను ఈ నెల 29, 30, 31 తేదిల్లో ప్రతి రోజు 1,000 బస్సుల చొప్పున నడపనున్నట్లు వివరించారు. రాఖీ పౌర్ణమికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై శనివారం సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాఖీ పౌర్ణమికి హైదరాబాద్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, హన్మకొండ, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, గోదావరిఖని, మంచిర్యాల, తదితర రూట్‌లలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే జేబీఎస్, ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లతో పాటు ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
గత ఏడాది ఆగస్టు 12న రాఖీ పండుగకు అధికారులు సమిష్టిగా పనిచేశారని గుర్తు చేశారు. ఫలితంగా ఒక్క రోజే రికార్డు స్థాయిలో 20 కోట్ల ఆదాయం సంస్థకు సమకూరిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒక్క రోజులో ఇంతమొత్తంలో ఆదాయం రాలేదని చెప్పారు. గత ఏడాది స్పూర్తితో ఈ రాఖీ పౌర్ణమి నాడు కూడా అలానే పనిచేయాలన్నారు.
టీఎస్‌ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత సంస్థపై బాధ్యత మరింతగా పెరిగిందని, ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేసి సంస్థకు మంచి పేరును తీసుకురావాలని సూచించారు.
"అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్. తమ సోదరులు జీవితాంతం తమకు రక్షగా ఉండాలని ఆ రోజున వారి చేతికి అక్కాచెల్లెళ్లు రాఖీ కడతారు. మానవ సంబంధాలకు, అనుబంధాలకు ముడిపడి ఉన్న ఈ పండుగ నాడు.. మహిళలు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గత ఏడాది రద్దీ దృష్ట్యా ఈ సారి రెగ్యూలర్ సర్వీసులకు తోడు 3 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గత రాఖీ పౌర్ణమి రోజున అక్యూపెన్సీ రేషియో(ఓఆర్) 87 శాతంగా నమోదైంది. నల్లగొండ, మెదక్, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్ రీజియన్లు 90 శాతానికిపైగా ఓఆర్ సాధించాయి. 12 డిపోల్లో 100 శాతం ఓఆర్ నమోదైంది. గత రికార్డుల నేపథ్యంలోనే ఈ సారి ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది." అని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు.
టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం www.tsrtconline.in వెబ్‌సైట్ ను సంప్రదించాలని సూచించారు. రాఖీ పౌర్ణమి ప్రత్యేక బస్సులకు సంబంధించిన మరింత సమాచారం కోసం సంస్థ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలన్నారు.
పండుగ నాడు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లి ఇబ్బందులకు గురికావొద్దని, టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీస్, రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు.