ఆ మూడు జిల్లాలను ఎల్‌డబ్ల్యూఈలో కొన‌సాగించండి.. అమిత్ షాను కోరిన రేవంత్‌

వామ‌ప‌క్ష తీవ్ర‌వాద ప్ర‌భావిత (ఎల్‌డ‌బ్ల్యూఈ) జిల్లాల నుంచి తొల‌గించిన ఆదిలాబాద్‌, మంచిర్యాల‌, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల‌ను ఎల్‌డ‌బ్ల్యూఈలో తిరిగి చేర్చాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

By Medi Samrat  Published on  7 Oct 2024 4:44 PM GMT
ఆ మూడు జిల్లాలను ఎల్‌డబ్ల్యూఈలో కొన‌సాగించండి.. అమిత్ షాను కోరిన రేవంత్‌

వామ‌ప‌క్ష తీవ్ర‌వాద ప్ర‌భావిత (ఎల్‌డ‌బ్ల్యూఈ) జిల్లాల నుంచి తొల‌గించిన ఆదిలాబాద్‌, మంచిర్యాల‌, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల‌ను ఎల్‌డ‌బ్ల్యూఈలో తిరిగి చేర్చాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఎల్ డబ్ల్యూఈ ప్రభావిత రాష్ట్రాలైన మ‌హారాష్ట్ర, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ల‌తో తెలంగాణ‌కు సరిహద్దు ఉండటంతో రాష్ట్ర భద్రతపైన మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రికి ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి, ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామాల్లో సీఆర్ఫీఎఫ్ జేటీఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

ఎస్పీవోల‌కు చెల్లించాల్సిన నిధుల్లో కేంద్రం వాటా 60 శాతం నాలుగేళ్ల నుంచి పెండింగ్ లో ఉంద‌ని, ఆ మొత్తం రూ.18.31 కోట్లు విడుదల చేయాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. 1,065 మందిని ఎస్పీవోల్లో చేర్చుకోవడానికి నిబంధనలు స‌డ‌లించాలని కోరారు. తెలంగాణ సరిహద్దుల్లోని మ‌లుగు జిల్లా పేరూరు, ములుగు, క‌న్నాయిగూడెం, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలోని ప‌లిమెల‌, మహ ముత్తారం, కాటారం వంటి పోలీస్ స్టేష‌న్ల‌ను బ‌లోపేతం చేయాల‌ని ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. తెలంగాణ పోలీస్ శాఖ కొత్త‌గా నియ‌మితులైన పోలీసు సిబ్బందికి గ్రేహౌండ్స్ ద్వారా తీవ్ర‌వాద వ్య‌తిరేక వ్యూహాల్లో (AET) శిక్ష‌ణ ఇప్పిస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి తెలిపారు. 2024-25 సంవ‌త్స‌రంలో ఈ ర‌క‌మైన శిక్ష‌ణ‌కు అదనపు బడ్జెట్ రూ.25.59 కోట్లు అవ‌స‌ర‌మ‌ని.. ఆ మొత్తాన్ని విడుద‌ల చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. ఆధునిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా పోలీసు ద‌ళాలను తీర్చిదిద్దే ప‌నుల‌కు ఉద్దేశించిన ప్ర‌త్యేక మౌలిక‌వ‌స‌తుల ప‌థ‌కం (ఎస్ఐఎస్‌)కు తెలంగాణ‌కు కేవ‌లం రూ.6.70 కోట్లు మాత్ర‌మే విడుద‌ల చేశార‌ని, అవి ఏమాత్రం స‌రిపోవ‌ని అద‌నంగా రూ.23.56 కోట్లు విడుద‌ల చేయాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.

Next Story