మద్యం మత్తులో తన తండ్రి తల్లిని తరచూ కొడుతున్నందుకు చర్య తీసుకోవాలని కోరుతూ ఓ తొమ్మిదేళ్ల బాలుడు పోలీసులను ఆశ్రయించాడు. వివరాళ్లోకెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్‌నగర్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న సుంకపాక భరత్ అనే బాలుడు ఉదయం కిలోమీటరు దూరం నడుచుకుంటూ ముస్తాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన తండ్రి బాలకృష్ణ మద్యం మత్తులో రోజూ తల్లి దీపికను కొడుతున్నాడని.. చర్య తీసుకోవాలని పోలీసులను అభ్యర్థించాడు.
ఎస్‌ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బాలుడి తండ్రి మద్యం మత్తులో తల్లితో తరచూ గొడవ పడేవాడని.. వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో కొట్టేవాడని బాలుడు తెలిపినట్లు పేర్కొన్నారు. తన తండ్రికి కౌన్సెలింగ్ ఇవ్వాలని బాలుడు ఎస్‌ఐని కోరాడు. బాలుడి అభ్యర్థన మేరకు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు.. దంపతులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవించాలని కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎలాంటి భయం లేకుండా తమ వద్దకు వచ్చినందుకు బాలుడిని అభినందించిన ఎస్‌ఐ.. ప్రజలకు ఏమైనా సమస్యలుంటే పోలీసులను ఆశ్రయించాలని కోరారు.