జూన్ 1 నుంచి సినిమా థియేటర్ల బంద్ చేస్తామని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు, నిర్మాతలు సమావేశం నిర్వహించారు. ఎగ్జిబిటర్ల డిమాండ్లపై తుది నిర్ణయం తీసుకునేందుకు మే 23న ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.
ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు, మైత్రీ రవి, సితార నాగవంశీ, డీవీవీ దానయ్య, సాహు గారపాటి, బాపినీడు సహా పలువురు అగ్ర నిర్మాతలంతా ఎగ్జిబిటర్ల డిమాండ్లపై చర్చించారు. పర్సంటేజ్ విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మల్టీప్లెక్స్‌ల్లో పర్సంటేజ్‌ను ప్రోత్సహిస్తున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, సింగిల్ స్క్రీన్‌లపై వేరే విధానాన్ని అవలంబిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కూడా మల్టీప్లెక్స్‌ల తరహాలోనే పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్లు ఉన్నాయి.