స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
By Knakam Karthik
స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఈ మేరకు బీసీ రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్ జారీ చేసేందుకు గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపామని వెల్లడించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. మంత్రివర్గ భేటీ ముగిసిన తర్వాత మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావుతో కలిసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు.
బీసీలకు 42 శాతం అమలు చేస్తూ స్థానిక ఎన్నికలకు వెళ్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఆర్డినేన్స్ ద్వారా రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి తెలిపారు. ప్రతి రెండు వారాలకు ఒక సారి మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ నెల 25న మరోసారి కేబినెట్ భేటీ ఉంటుందని తెలిపారు. అలాగే పెండింగ్ ప్రాజెక్టులకు భూసేకరణ చేయాలని కూడా మంత్రి వర్గం నిర్ణయించినట్లు వెల్లడించారు.
కాగా కేబినెట్ సమావేశంలో కీలక అంశాలను ఆమోదించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ప్రతిష్ఠాత్మకమైన 2 విద్యాసంస్థలను వర్సిటీలుగా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. అమిటీ విద్యాసంస్థకు వర్సిటీ హోదా ఇచ్చేందుకు నిర్ణయించామని తెలిపారు. అమిటీ, సెంటిమేరీ రీహాబిటేషన్ విద్యాసంస్థలో రాష్ట్ర విద్యార్థులకు 50 శాతం సీట్లు కల్పిస్తామన్నారు. గోశాలల నిర్వహణకు పాలసీ తీసుకొచ్చేందుకు కేబినెట్ నిర్ణయించిందని వెల్లడించారు.