కొడుకులు తనను పట్టించుకోవడం లేదంటూ ఓ పూజారి తనకున్న అసైన్డ్ భూమిని గ్రామపంచాయతీకి రాసిచ్చిన ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేటలో చోటు చేసుకుంది. గ్రామంలో పూజారులు ఎవరూ లేకపోవడంతో 50 సంవత్సరాల క్రితం భీమదేవరపల్లి మండలం కొప్పూర్‌కు చెందిన నాగిళ్ల వెంకటేశ్వర్లును పెంచికల్‌పేటకు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆయన జీవనోపాధి కోసం 4.38 ఎకరాల భూమిని సాగుకోసం కేటాయించారు. అప్పటి నుంచి వెంకటేశ్వర్లు ఆ భూమిలో పంటలు పండిస్తూ గ్రామం లో పౌరోహిత్యం చేస్తున్నారు.
ఆయనకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఇటీవల భార్య మరణించడం కుమారులు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో అతడి బాగోగులు చూసుకునే వారు కరువయ్యారు. వృద్ధాప్యంలో తనను పిల్లలు పట్టించుకోవడం లేదని మనోవేదనకు గురయ్యారు. ఆలయంలో మరో పూజారిని నియమించడంతో గతంలో గ్రామస్తులు తనకు కేటాయించిన భూమిని తిరిగి గ్రామానికే ఇవ్వాలని వెంకటేశ్వర్లు నిశ్చయించుకున్నారు.